కోల్‌కతా: బెంగాలీ సినీ నటి కోయల్ మల్లిక్ మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది నెలల క్రితమే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె.. ఆ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు బీజేపీ తమ అభ్యర్థిగా ఆమెను ఎంపిక చేసింది. కోయల్ మల్లిక్ బెంగాలీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. ఆమె అసలు పేరు రుక్మిణి మల్లిక్. ప్రముఖ బెంగాలీ నటుడు రంజిత్ మల్లిక్, దీపా మల్లిక్ దంపతుల కుమార్తె. కోల్‌కతాలోని మోడర్న్ హై స్కూల్ ఫర్ గర్ల్స్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆమె.. గోఖలే మెమోరియల్ గర్ల్స్ కాలేజీలో ఉన్నత విద్య చదివారు. సైకాలజీలో బీఎస్సీ పట్టా పొందారు.
ఈ ఏడాది ఆరంభంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమెను టీఎంసీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేశారు. ఏప్రిల్ 6న కోయల్ మల్లిక్ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పార్లమెంటులో ఒక్క సమావేశానికి కూడా హాజరుకాకముందే ఆమె పదవికి రాజీనామా చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. జూలై 16న కోయెల్ మల్లిక్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలిన కొద్దికాలానికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అక్టోబర్ 16న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
కోయల్ మల్లిక్ రాజీనామా విషయాన్ని ముందుగానే టీఎంసీ నాయకత్వానికి ఈ మెయిల్ ద్వారా తెలియజేసినట్లు మమతా బెనర్జీ అప్పట్లో వెల్లడించారు. అనంతరం ఆమె స్వయంగా రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కోయల్‌ను ప్రతిభావంతమైన, గౌరవనీయమైన సినీ కళాకారిణిగా మమత పేర్కొన్నారు. టీఎంసీకి రాజీనామా చేసిన కొన్ని నెలలకే కోయల్ మల్లిక్ పేరు బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా తెరపైకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ నుంచి జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఆమెను బీజేపీ ఎంపిక చేసింది. దీంతో ఒకే ఏడాదిలో టీఎంసీ తరఫున రాజ్యసభలోకి వచ్చిన కోయెల్.. అదే పదవికి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా మారడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇదీ చదవండి: అద్దెకు ‘ఆ నలుగురు’... ఇది ‘చివరి స్టార్టప్’


