మమ్మల్ని బిచ్చగాళ్లుగా చూస్తారా? | Kakinada BJP Leader Bikkina Visweswara Rao Fire On TDP | Sakshi
Sakshi News home page

మమ్మల్ని బిచ్చగాళ్లుగా చూస్తారా?

Nov 19 2026 11:13 AM | Updated on Nov 19 2026 11:15 AM

 Kakinada BJP Leader Bikkina Visweswara Rao Fire On TDP

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న బిక్కిన విశ్వేశ్వరరావు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీని చిన్నచూపు చూడడం సరికాదని, ఎన్నికల్లో తమకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించకపోతే తమ పార్టీ సత్తా ఏమిటో చూపిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటించాల్సిందేనని, బీజేపీకి గౌరవప్రదమైన రీతిలో కనీసం 10 కార్పొరేటర్‌ స్థానాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పొత్తు ధర్మాన్ని విస్మరిస్తే ఆయా డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటులో తమ పారీ్టకి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 ప్రస్తుతం 4 కార్పొరేటర్‌ స్థానాలు మాత్రమే కేటాయిస్తామని కూటమి నేతలు చెబుతున్నారని, ఇది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కుండ బద్దలుగొట్టారు. గతంలో కాకినాడ నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉన్న సమయంలోనే కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి 9 స్థానాలు కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం డివిజన్ల సంఖ్య 66కు పెరిగినందున తమకు కనీసం 10 స్థానాలు కేటాయించాల్సి ఉండగా, కేవలం 4 స్థానాలకే పరిమితం చేయాలని చూడటం సరికాదని స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

ఈ విషయంలో టీడీపీ, జనసేన నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నామని బిక్కిన తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తమ పట్ల గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నారని, అయితే రూరల్‌ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) వైఖరి మాత్రం అభ్యంతరకరంగా ఉందని ధ్వజమెత్తారు. తమ సమస్యలను వివరించేందుకు వెళ్తే చులకన భావంతో మాట్లాడుతున్నారని, బీజేపీ నాయకులను భిక్షాటన చేసే వారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఫోన్‌ చేసినప్పటికీ పంతం నానాజీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. 

కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కనీస గౌరవం ఇవ్వకపోవడమేమిటని ప్రశ్నించారు. రూరల్‌ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సీట్ల కేటాయింపులో జరుగుతున్న పరిణామాలు తమ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయన్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు పలు డివిజన్లలో పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారని వెల్లడించారు. సీట్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి తమకు లేదని బిక్కిన స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు యార్లగడ్డ రామ్‌కుమార్, దువ్వూరి సుబ్రహ్మణ్యం, కొక్కిలిగడ్డ గంగాధర్, కుండల సాయికుమార్, గొరకపూడి చిన్నయ్యదొర, ఏడిద కృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement