సాక్షి, విజయవాడ: జనసేనలో రూ.7 కోట్ల వసూళ్ల కేసు కొత్త మలుపు తిరిగింది. ఆ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ధరణికృష్ణ విడుదల చేసిన వీడియో రాజకీయంగా కలకలం రేపుతోంది. తనను ఈ కేసులో బలిపశువును చేశారని, అసలు వ్యవహారం వెనుక జనసేన నేతలు కళ్యాణ్ శ్రీనివాస్ (కేకే), పెద్దిరాజు ఉన్నారని ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. మరోవైపు న్యాయం కోసం చట్టపరంగానే పోరాడతానని కోట రుక్మిణి స్పష్టం చేయగా.. పార్టీలోనే కొందరు కట్టప్పలున్నారంటూ కేకే చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రాజేశాయి.
జనసేనలోనూ కొంతమంది కట్టప్పలు ఉన్నారని.. వారు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన నేత కళ్యాణ్ శ్రీనివాస్ (కేకే) పేర్కొన్నారు. మరోవైపు, న్యాయం కోసం తన పోరాటం చట్టపరంగానే ఉంటుందని కోట రుక్మిణి ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. తనను బలిపశువు చేశారంటూ ధరణికృష్ణ వీడియో విడుదల చేశారు. మొత్తం చేసింది జనసేన నేత కళ్యాణ్ శ్రీనివాస్, పెద్దిరాజులేనని ధరణికృష్ణ అంటున్నారు.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నామని, దేవదాయ శాఖలో ఈఓ పోస్టులు, ఎస్‌ఐ పోస్టు ఇప్పిస్తామని చెబుతూ రూ.7 కోట్లు వసూలు చేసిన కుంభకోణంలో పెద్దిరాజుతోపాటు ధరణి కృష్ణ అనే మహిళదే కీలకపాత్ర అని కళ్యాణ్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఈ కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదన్నారు. పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న తనను, కోట రుక్మిణిని పవన్ కళ్యాణ్‌కు దూరం చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు.
వీడియోలో ధరణికృష్ణ మాట్లాడుతూ.. ఏడు కోట్ల స్కాన్ నేనే చేశానంటున్నారు.. నాకు ఏడు కోట్లు ఎవరిచ్చారు? ఎప్పుడిచ్చారు? అంటూ ఆమె ప్రశ్నించారు. కేకే, పెద్దిరాజుల మధ్య ఆర్థిక సంబంధాలు బయటికి రాకుండా నన్ను బలిపశువు చేస్తున్నారు. 2021 నుంచి నాకు జనసేన సభ్యత్వం ఉంది. నాకు జనసేన పార్టీకి ఉన్న సంబంధం ఏంటో బయటపెడతా?. లోకల్ బాడీ ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. జనసేన లోకల్ బాడీ ఎన్నికల యాప్ డిజైన్ చేసింది నేనే. యాప్ వర్క్ అంతా చేసింది నేనే. లాగిన్ యాక్సెస్‌లు తీసేయొచ్చు.. కానీ నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి.
వేరే కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లను చూపించి నా పై నిందలు వేస్తున్నారు. నాపై హ్యాబిచ్యువల్ చీటర్ అని ముద్రవేశారు. హరిప్రసాద్, పవన్ బాలాజీ, సుధీర్ పేర్లు చెప్పాలని నన్ను పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టారు. అనంతపురానికి చెందిన జయరాం రెడ్డి నాకు తొమ్మిది లక్షలు ఇచ్చారు. మేయర్ సీటు కోసం జయరాంరెడ్డి ప్రయత్నించారు. తన తరపున సోషల్ మీడియాలో ప్రచారం కోసం పొలిటికల్ అనలిస్ట్ సర్వీసు కోసం నాకు ఇచ్చారు. 36 మంది బాధితులుంటే వాళ్లు ఎందుకు బయటికి రాలేదు. వాళ్లతో ఎందుకు కేసులు పెట్టించలేదు?. వాళ్లంతా బయటికి వస్తే కేకే బండారం బయటపడుతుందని భయం. కేకే నన్ను బతకనివ్వడు. కేకే వల్ల నాకు ప్రాణహాని ఉంది. నేను చనిపోతే అందుకు కారణం కేకే. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ బయటపెడతా’’ అని ధరణి కృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి: జనసేన ‘కోట’ రహస్యం!!.. రూ.7 కోట్ల గూడుపు‘ఠాణా’!


