అందుకే వారికి ప్రేమంటే తెలియడం లేదు
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: భోజనాల సమయంలో అమ్మ నాన్న ఒళ్లో కూర్చునేదన్న తన వ్యాఖ్యపై వస్తున్న విమర్శలకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం స్పందించారు. ఎక్స్ వేదికగా ఒక పోస్టు చేస్తూ... బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల మద్దతుదారుల గుండెల నిండా ద్వేషం, భయం, కోపాలు గూడుకట్టుకుని పోయాయని అందుకే వాళ్లు ప్రేమను వ్యక్తీకరించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
మహా శివుడి ఒళ్లో పార్వతి కూర్చున్న 12వ శతాబ్ధపు శిల్పం ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘అసలైన హిందువుగా వారిని ద్వేషం, కోపం, భయాల నుంచి విముక్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అప్పుడే వాళ్లు తమ జీవితాల్లో ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వల్ల కలిగే అద్భుతమైన ఆనందాన్ని, అందాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు. సత్యం... శివం... సుందరం’’అని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా మద్దతిచ్చింది.
ఇలాంటి అంశాలపై చర్చ జరగాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ‘‘ప్రేమను దాచుకోవాల్సిన అవసరం లేదు. ఆప్యాయత అన్నది బలహీనత కానేకాదు. భాగస్వామిని సమవుజ్జీగా భావించడంతోనే సమానత్వం అన్నది మొదలవుతుంది’’అని కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో ఒక పోస్టు చేసింది. రాహుల్ పోస్టును ట్యాగ్ చేసింది. ‘‘ప్రేమ, గౌరవం, సమానత్వం.. ఇదే హిందూ మత సారాంశం. శివుడి ఒడిలో కూర్చున్న పార్వతీ దేవి సమాన భాగస్వామి. జనాల అప్రస్తుత అభిప్రాయాలకు అతీతంగా ఇద్దరి అనురాగానికి నిదర్శనం’’అంటూ పేర్కొంది.


