మీడియా ద్వారానే తీర్పు విషయం తెలుసుకున్నా.
ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిలివ్వడంపై బాధితురాలు బిల్కిస్ బానో ఆవేదన
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలకు పైగా సాగిన న్యాయపోరాటం.. ఎన్నో అవమానాలు, ఆవేదనలు, ఎదురుదెబ్బలు.. అయినా న్యాయం దక్కుతుందన్న నమ్మకంతో ముందుకు సాగిన తనకు మళ్లీ నిరాశే మిగిలిందని బాధితురాలు బిల్కిస్ బానో ఆవేదన వ్యక్తం చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఏడుగురు కుటుంబ సభ్యులను దారుణంగా చంపిన కేసులో దోషులైన 11 మందిలో ఇద్దరికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతోపాటు జీవిత ఖైదు శిక్ష అమలును నిలిపివేయడంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పు వస్తుందని తాను ఊహించలేకపోయానన్నారు. ఈ మేరకు సీనియర్ న్యాయవాది శోభా గుప్తా ద్వారా బాధితురాలు బిల్కిస్ బానో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నా మాటలు కూడా కన్నీళ్ల మధ్య వస్తున్నాయి
తన కేసులో ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసిన విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందన్నారు. ‘నా మాటలు కూడా కన్నీళ్ల మధ్య నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. బాధ, దిగ్భ్రాంతి, నమ్మలేకపోవడం.. ఇవన్నీ నన్ను వెంటాడుతున్నాయి. రెండోసారి కూడా నన్ను పిలవకుండా, నా వాదన వినకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని నమ్మలేకపోతున్నాను’అని బిల్కిస్ బానో పేర్కొన్నారు.
పాత భయాలు మళ్లీ వెంటాడుతున్నాయి
‘మళ్లీ భయపడుతున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం ఆందోళన చెందుతున్నాను. న్యాయంపై ఉన్న విశ్వాసాన్ని మరోసారి కోల్పోతానేమోనని భయంగా ఉంది. నాకు అన్యాయం చేసిన వ్యక్తుల శిక్షను సుప్రీంకోర్టు ఎలా నిలిపివేస్తుంది? కనీసం నాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? న్యాయస్థానంలో నా గొంతు వినిపించే అవకాశం ఎందుకు లేకుండా చేశారు?’అని బానో ప్రశ్నించారు. తాజా ఉత్తర్వులపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తన పిల్లలు జీవితాంతం ఈ భయాలు, గాయాల నీడలో బతకాల్సిన పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ పోరాటం చేస్తున్నానని తెలిపారు.
గుజరాత్‌ను వీడిన బిల్కిస్ బానో
అహ్మదాబాద్: ఇద్దరు దోషులకు విధించిన జీవిత ఖైదుపై స్టే విధించడంతోపాటు బెయిలిస్తూ సుప్రీంకోర్టు అక్టోబర్ 28న ఇచ్చిన ఆదేశాలతో బిల్కిస్ బానో, కుటుంబసభ్యులు షాక్‌కు, భయాందోళనలకు గురయ్యారని ఆమె బంధువు ఒకరు వెల్లడించారు. దీంతో, బిల్కిస్, ఆమె కుటుంబం ఇటీవలే గుజరాత్‌ను విడిచిపెట్టి వెళ్లారని చెప్పారు.


