అద్దెకు ‘ఆ నలుగురు’... ఇది ‘చివరి స్టార్టప్‌’ | Four Shoulders for Hire A New Support System for Last Rites in Kashi | Sakshi
Sakshi News home page

అద్దెకు ‘ఆ నలుగురు’... ఇది ‘చివరి స్టార్టప్‌’

Oct 4 2026 1:10 PM | Updated on Oct 4 2026 1:14 PM

Four Shoulders for Hire A New Support System for Last Rites in Kashi

వారణాసి అంటే.. మోక్షనగరి.. జీవితంలో చివరి ప్రయాణం అక్కడే ముగిస్తే ముక్తి లభిస్తుందనే నమ్మకం పలువురు హిందువుల్లో ఉంది. అయితే అంతిమయాత్రలో పాడె మోసేందుకు ఆ నలుగురు అందుబాటులో లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి ఒంటరి కుటుంబాలకు ఇప్పుడు కాశీలో కొందరు యువకులు అండగా నిలుస్తున్నారు. డబ్బు తీసుకుని అంతిమయాత్రలో పాడె మోస్తున్న ఈ  నూతన సర్వీస్‌ ఇప్పుడు మారుతున్న సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది.

భార్యను చివరి సారిగా తీసుకెళ్తూ..
సిన్హా సాహెబ్‌ తన భార్యను కోల్పోయారు. ఆమె మృతదేహం వెనుక వాహనంలో ఉండగా.. ఆయన డ్రైవర్‌ పక్కన కూర్చొని ఉన్నారు. జీవితాంతం తనకు తోడుగా ఉన్న భార్యను చివరి ప్రయాణానికి ఘాట్‌ వరకు ఎలా తీసుకెళ్లాలన్నదే ఆయన ముందున్న ప్రశ్న. భార్య మరణించి అప్పటికే ఎనిమిది గంటలు గడిచాయి. ఈ సమయంలో ఆయన బంధువులందరికీ ఫోన్లు చేశారు. అయితే దూరం కారణంగా ఎవరూ రాలేకపోయారు. కొందరు తమ ఇబ్బందులను చెప్పారు. దీంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయారు.

బంధాలు దూరమైనప్పుడు..
సిన్హా సాహెబ్‌ గతంలో ఉన్నత పదవిలో పనిచేశారు. తన హోదా కారణంగా ఇతరుల ఇళ్లకు వెళ్లడం, సామాజిక సంబంధాలను కొనసాగించడం పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ రోజు తన ఒంటరితనం ఎంత పెద్ద సమస్యగా మారిందో ఆయనకు అర్థమైంది. జీవితంలో ఇతరుల సుఖదుఃఖాల్లో తాను కూడా భాగస్వామిగా ఉండి ఉంటే.. ఈ రోజు తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనే ఆలోచన ఆయనలో కలిగింది. వెనుక వాహనంలో ఉన్న భార్య మృతదేహం తన పాడె ఎవరు మోస్తారా.. అని ఎదురుచూస్తోంది.

ముందుకొచ్చిన నలుగురు యువకులు
అలాంటి సమయంలో నలుగురు యువకులు ఆయన వద్దకు వచ్చారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత సిన్హా సాహెబ్‌ అంగీకరించారు. భార్యను కోల్పోయిన బాధ అలాగే ఉన్నప్పటికీ.. కనీసం ఆమె అంతిమయాత్ర సక్రమంగా జరుగుతుందనే కొంత ఊరట ఆయనకు కలిగింది. ఆ నలుగురు యువకులు తమ భుజాలు పంచడంతో అంతిమయాత్ర ఘాట్‌ వైపు సాగింది.

‘రామ్ నామ్ సత్య హై’ మధ్య మరో దృశ్యం
అంతిమయాత్ర ముందుకు సాగుతుండగా అకస్మాత్తుగా హారన్‌ శబ్దం వినిపించింది. శవవాహనాలు కూడా వెళ్లేందుకు ఆంక్షలు ఉన్న మార్గంలో హారన్‌ మోగిస్తూ వాహనాల కాన్వాయ్‌ వచ్చింది. అది బహుశా ఏదో వీఐపీ కాన్వాయ్‌ అయి ఉండొచ్చని సిన్హా గ్రహించారు. కాన్వాయ్‌ వెళ్లిన తర్వాత అంతిమయాత్ర మళ్లీ ముందుకు సాగింది. ఆ రోజు సిన్హా సాహెబ్‌ రెండు విషయాలను గ్రహించారు. పదవి పోయిన తర్వాత మనుషులు దూరమవుతారని, అలాగే సామాజికంగా ఉండటం అంటే కేవలం అందరితో కలవడం మాత్రమే కాదని.. అవసరమైన సమయంలో ఒకరి పక్కన మరొకరు నిలబడటమని ఆయనకు అర్థమైంది.

బంధువులు కాకపోయినా.. చివరి ప్రయాణంలో తోడుగా..
సిన్హా సాహెబ్‌ భార్య పాడె మోసిన ఆ నలుగురు ఆయన బంధువులు కాదు. కాశీలోని కొత్త స్టార్టప్‌ ప్రతినిధులు. కుటుంబ సభ్యులు లేదా బంధువులు అందుబాటులో లేని వ్యక్తుల అంతిమయాత్రలో వీరు తమ సేవలు అందిస్తున్నారు. ఇందుకు ప్రతిగా తగినంత రుసుము తీసుకుంటున్నారు. దీనిని కమర్షియల్‌గా చూడొచ్చు.. మారుతున్న సమాజపు అవసరంగా భావించొచ్చు.. లేదా బలహీనపడుతున్న కుటుంబ, సామాజిక సంబంధాల పర్యవసానంగా చూడొచ్చు. అయితే ఒక విషయం మాత్రం సుస్పష్టం.. ఈ నూతన స్టార్టప్‌ కారణంగా కనీసం  చివరి ప్రయాణం ఒంటరిగా కాకుండా ‘ఆ నలుగురు’ సాయంతో సాగుతోంది.

సంపాదన కోసం మొదలై.. సేవగా మారింది
ఈ సర్వీస్‌ అందిస్తున్న సుభాష్‌ సోనీ మాట్లాడుతూ.. మొదట డబ్బు కోసం ఈ పని ప్రారంభించానని, కానీ ప్రతి సారి ఓ కుటుంబానికి సాయం అందించినప్పుడు ఇది కేవలం డబ్బు కోసం చేసే పని కాదనే భావన కలుగుతోందని చెప్పారు. ఆ సమయంలో ఆ కుటుంబానికి ఎవరో ఒకరి తోడు అవసరమని గుర్తించానని అన్నారు.

దీనదయాల్‌ గోండ్‌ మాట్లాడుతూ.. మొదట మరో పని దొరికితే ఈ పనిని వదిలేస్తానని అనుకున్నానని, కానీ క్రమంగా ఇదే తనకు సొంత పనిలా అనిపించిందని చెప్పారు. రమేశ్‌ మాట్లాడుతూ.. తాను చేస్తున్న పని ఏమిటో మొదట కుటుంబ సభ్యులకు అర్థం కాలేదని, ఇప్పుడు వారు కూడా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. కనీసం మరొకరికి ఉపయోగపడుతున్నాననే భావన తనలో కలుగుతున్నదన్నారు.

ఇవే సేవల్లో పాల్గొంటున్న మనీష్‌ పాల్‌ మాట్లాడుతూ.. జనం రోజంతా ఫోన్లలోనే గడుపుతూ ఒకరికి ఒకరు దూరమవుతున్నారని అన్నారు. ఇలాంటి చివరి సమయంలో ఒకరి పక్కన నిలబడే వారు తగ్గిపోతున్నారని, అందుకే తమలాంటి వారి అవసరం ఏర్పడుతోందని చెప్పారు. కాశీలో ప్రారంభమైన ఈ సరికొత్త సర్వీస్‌.. మారుతున్న సామాజిక సంబంధాలకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. బంధాలు బలహీనపడుతున్నా.. అంతిమ ప్రయాణంలో మాత్రం ఎవరో ఒకరు తోడుగా నిలుస్తున్నారు. ఆ నలుగురు  అవసరమయ్యే ఆ సమయంలో.. బంధుత్వం లేకపోయినా మానవత్వం అండగా నిలుస్తోంది.

ఇదీ చదవండి: ‘హనుమాన్‌ అంశ్‌’ ‍ప్రభావం.. కైంచీ ధామ్‌లో అనూహ్య రద్దీ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement