తొలిసారి కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ
రాహుల్‌కు ధన్యవాదాలు తెలియజేసిన అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’కూటమి, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఒకే గళం వినిపిస్తున్నాయి. ఓట్ల చోరీపై పోరాడుతున్నాయి. కానీ, కాంగ్రెస్, సీజేపీలు ఇప్పటిదాకా ఉమ్మడి వేదికను పంచుకోలేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీ, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా ఇన్నాళ్లూ పరస్పరం దూరం పాటించారు. అయితే, రాహుల్ గాంధీ తొలిసారిగా సీజేపీకి బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
జంతర్‌మంతర్ వద్ద నిరసన వ్యక్తంచేసిన సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను అరెస్టు చేయడం, జ్యుడీషియల్ కస్టడీకి తరలించడాన్ని రాహుల్ గాంధీ బుధవారం ఖండించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలో భాగంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం నేరం కాదని పేర్కొన్నారు. అందుకు యువతను జైలులో పెట్టడం పిరికితనం అంటూ విమర్శించారు. జంతర్ మంతర్ ముమ్మాటికీ దేశ ప్రజలదేనని స్పష్టంచేశారు.
జంతర్ మంతర్‌ను తిరిగి స్వా«దీనం చేసుకుంటామని ప్రకటించారు. తమకు మద్దతు ప్రకటించిన రాహుల్ గాం«దీకి అభిజీత్ దీప్కే వెంటనే ధన్యవాదాలు తెలియజేయడం విశేషం. కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు వస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు సీజేపీతో వేదిక పంచుకోవడానికి రాహల్ గాంధీ విముఖత చూపారు.
ఈ ఏడాది జూలైలో పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన భారీ ఆందోళన సమయంలో కూడా దూరంగానే ఉన్నారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష సమయంలో కూడా ఆయన జంతర్ మంతర్‌ను సందర్శించలేదు. సీజేపీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’కార్యక్రమానికి కూడా అండగా నిలవలేదు. రాహుల్ గాంధీ ఇప్పుడు హఠాత్తుగా సీజేపీకి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.


