‘ఇండియా’ కూటమికి శరద్‌ పవార్ బిగ్ షాక్?! | Sharad Pawar Delimitation Support,Cabinet Berth For Daughter Supriya Sule | Sakshi
Sakshi News home page

‘ఇండియా’ కూటమికి శరద్‌ పవార్ బిగ్ షాక్?!

Nov 28 2026 7:59 AM | Updated on Nov 28 2026 8:09 AM

Sharad Pawar Delimitation Support,Cabinet Berth For Daughter Supriya Sule

ముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమికి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ-శరద్ చంద్రపవార్) బిగ్ షాక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు కేంద్రానికి ఎన్సీపీ-ఎస్పీ మద్దతు పలకనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేకు ప్రధాని మోదీ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న సంకేతాలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడంతో పాటు, రాష్ట్రాల వారీగా సీట్ల నిష్పత్తిని 2051 వరకు యథాతథంగా ఉంచే (ఫ్రీజ్) ప్రతిపాదనతో కూడిన సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపడి ఉన్న ఈ బిల్లును నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న నాలుగు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. లోక్‌సభ గరిష్ట స్థానాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెంచడం ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సంఖ్యాబలం లెక్కల్లో పవార్ కీలకం
డీలిమిటేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ పరిధిలోకి వస్తుంది కాబట్టి, లోక్‌సభలో ఆమోదం పొందడానికి హాజరును బట్టి సుమారు 360 మంది సభ్యుల (మూడింట రెండొంతుల మెజారిటీ) మద్దతు అవసరమని ప్రభుత్వ వర్గాల అంచనా. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు ప్రస్తుతం 319 మంది సభ్యుల బలం (బీజేపీ-241) ఉంది. లోక్‌సభలో శరద్ పవార్ వర్గానికి ఉన్న 8 మంది ఎంపీల మద్దతు తోడైతే ఎన్డీయే బలం 327కు చేరుతుంది. అందుకే పవార్ మద్దతు కోసం బీజేపీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

కేబినెట్ బెర్త్ ఊహాగానాలు.. పార్టీలో భిన్న స్వరాలు
ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ప్రతిఫలంగా సుప్రియా సూలేకు కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ధృవీకరణ లేదు. అయితే, ఎన్సీపీ-ఎస్పీలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ సీనియర్ నేత జితేంద్ర ఆవ్హాద్ ప్రకటించగా, పూర్తి ముసాయిదా చూశాకే తుది నిర్ణయం తీసుకుంటామని రోహిత్ పవార్, అమోల్ కోల్హే స్పష్టం చేశారు. సుప్రియా సూలే సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బిల్లు కాపీ చేతికి అందకుండా ఇప్పుడే ఏమీ చెప్పలేను, సోమవారం లోక్‌సభలోనే మా వైఖరి వెల్లడిస్తాం అన్నారు. మరోవైపు, ప్రత్యేక సమావేశాలకు హాజరుకావాలని తమ 8 మంది ఎంపీలకు ఎన్సీపీ-ఎస్పీ త్రీ-లైన్ విప్ జారీ చేసింది.

పవార్ వ్యూహం ఏంటి?
గత ఏప్రిల్‌లో డీలిమిటేషన్ బిల్లును ఎన్సీపీ-ఎస్పీ వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు 50 శాతం పెంపు, 2051 వరకు సీట్ల నిష్పత్తి ఫ్రీజ్ వంటి షరతులకు కేంద్రం అంగీకరించడంతో పవార్ వైఖరి మారినట్లు కనిపిస్తోంది. ఒకవైపు మద్దతు సంకేతాలు ఇస్తూనే, మరోవైపు ముసాయిదా చూశాకే నిర్ణయం అని చెప్పడం శరద్ పవార్ మార్క్ రాజకీయ వ్యూహానికి నిదర్శనం. నిజంగానే సుప్రియా సూలే కేంద్ర మంత్రివర్గంలో చేరుతారా, లేక చివరి నిమిషంలో ఇండియా కూటమితో కలిసి పవార్ మరో ఎత్తుగడ వేస్తారా అనేది సోమవారం పార్లమెంట్ వేదికగా తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement