సాక్షి, చెన్నై : మహిళా అధికారిణికి అసభ్యకరమైన సందేశాలు పంపి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై తమిళనాడులోని కళ్లకురిచ్చి నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్‌ను శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. మద్రాసు హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు అధికారి, తిరుప్పూర్ జిల్లా ఎస్పీ సృష్టిసింగ్ నేతృత్వంలోని బృందం ఆయన్ను అరెస్టు చేసింది.
టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్ తనకు అవాంఛిత సందేశాలు పంపుతూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళా అధికారిణి ఈ నెల 23న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కళ్లకురిచ్చి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ పోలీసులు లైంగిక వేధింపులు, వెంటపడటం (స్టాకింగ్), అసభ్యకర ప్రవర్తన, ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం తదితర అభియోగాలతో 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మేజిస్ట్రేట్ ఎదుట రహస్య వాంగ్మూలం
ఈ వ్యవహారంలో ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారి, డివిజనల్ కమిషనర్, తాలూకా కమిషనర్, కలెక్టర్ సహాయకులను పోలీసులు విచారించారు. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన తిరుప్పూర్ ఎస్పీ సృష్టిసింగ్ శుక్రవారం కళ్లకురిచ్చి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో స్థానిక ఎస్పీ షానాజ్‌తో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు సేకరించిన దర్యాప్తు ఫైళ్లను పరిశీలించిన అనంతరం, మధ్యాహ్నం కలెక్టరేట్‌కు వెళ్లి ఫిర్యాదుదారురాలైన మహిళా అధికారిణి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే అరుళ్ విఘ్నే‹Ùను పోలీసులు అరెస్టు చేశారు.


