చెన్నై: తమిళనాడు ప్రభుత్వం పురుష ఉద్యోగులకు తొలిసారిగా 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఉద్యోగులకు ఇప్పటికే 365 రోజుల ప్రసూతి సెలవులు కల్పిస్తుండగా, పురుషులకూ పితృత్వ సెలవులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నుంచి ప్రభుత్వానికి అభ్యర్థనలు అందాయి.
దీంతో సీఎం విజయ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భార్య ప్రసవించేందుకు 15 రోజుల ముందుగానీ, లేదా బిడ్డ జన్మించిన తేదీ నుంచి ఆరు నెలలలోపు ఎప్పుడైనా ఈ సెలవులను తీసుకునే వెసులుబాటు కల్పించారు. తల్లిదండ్రుల బాధ్యతలను మరింత పంచుకునేలా ప్రోత్సహించడం, కుటుంబ బాధ్యతల్లో భార్యాభర్తలిద్దరూ సమాన భాగస్వాములయ్యేలా చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ప్రసవం తర్వాత తొలి వారాలు, నెలలు కుటుంబాలకు ఎంతో సవాలుతో కూడుకున్నవి. ఒక వైపు తల్లి ప్రసవం నుంచి కోలుకుంటుండగా.. మరోవైపు అప్పుడే పుట్టిన బిడ్డ సంరక్షణ బాధ్యతలకు తల్లిదండ్రులు అలవాటు పడాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో పితృత్వ సెలవుల అమలుతో శిశువు సంరక్షణలో తండ్రి భాగస్వామ్యం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఉద్యోగాలు చేసే దంపతులు తల్లిదండ్రులుగా మారిన తొలి రోజుల్లో ఎదురయ్యే బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ఈ వెసులుబాటు దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: పాకిస్తాన్ కంటెంట్ ప్రసారం వద్దు!


