దీపం వివాదం.. మరో కీలక మలుపు | BJP Launches Sharp Attack On TVK Government Over Tirupparankundram Deepathoon Row, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

దీపం వివాదం.. మరో కీలక మలుపు

Nov 25 2026 9:21 AM | Updated on Nov 25 2026 9:37 AM

Bjp Sharp Attack On Tvk Government Over Deepathoon Row

తమిళనాడులో తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వివాదం మరింత ముదిరింది. ప్రాచీన రాతి దీప స్తంభంపై కార్తీక దీపం వెలిగించలేదు. అయితే, పాత సంప్రదాయం ప్రకారం కొండపై ఉన్న ఉచ్చి పిళ్లయార్‌ ఆలయ మండపంలోనే దీపాన్ని వెలిగించారు. ఈ పరిణామంపై టీవీకే ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మురుగన్‌ స్వామి భక్తులకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్‌ కేశవన్ ధ్వజమెత్తారు.

‘సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, పవిత్రమైన కార్తీక దీపాన్ని దీపత్తూన్‌ దగ్గర వెలిగించకుండా అడ్డుకున్న టీవీకే సర్కార్‌ తమిళ ప్రజలను మోసం చేసిందని.. మురుగన్‌ స్వామి భక్తులైన లెక్కలేనంత మందికి వెన్నుపోటు పొడిచిందంటూ కేశవన్‌ ఇవాళ (బుధవారం) ఎక్స్‌ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

హిందూ భక్తుల విషయంలో టీవీకే ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని.. కోట్లాది మంది ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆయన ఆరోపించారు. భక్తులను, వారి విశ్వాసాలను అవమానించిందని మండిపడ్డారు. వివక్షపూరిత, విభజన రాజకీయాలను తమిళనాడు ప్రజలు, మురుగన్‌ భక్తులు ఎన్నటికీ మర్చిపోరని.. క్షమించరని కేశవన్‌ వ్యాఖ్యానించారు. టీవీకే ప్రభుత్వానికి కూడా డీఎంకేకు పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యానించారు.

కాగా, మదురైలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుప్పరంకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలంటూ దశాబ్దాలుగా న్యాయ పోరాటాలు జరుగుతున్నాయి. దీపస్తంభం వద్ద దీపం వెలిగించాలని గత ఏడాది మద్రాసు హైకోర్టు ఆదేశించినా అప్పటి డీఎంకే ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది.

దీప స్తంభంపై ఒక్కరోజు దీపం వెలిగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం సాయంత్రం దీప స్తంభంపై దీపాన్ని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అధికారులు అక్కడ దీపం వెలిగించకపోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు. మదురైలో హిందూ సంఘాల సభ్యులు, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

కోర్టు సూచించిన చోట దీపం వెలిగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుప్పరంకుండ్రంలో అకస్మాత్తుగా నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఒక ప్రత్యేక చర్యగానైనా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మదురై జిల్లా యంత్రాంగంపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేయడానికి హిందూ సంఘాలు సిద్ధమవుతున్నాయి.

నిరసన జరగడానికి కొన్ని గంటల ముందు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం ఈ కేసు విచారణ జరిపింది. వివాదాస్పద స్తంభం వద్ద ఒక్కసారి దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచి్చన మధ్యంతర ఉత్తర్వులను పాటించాలని జిల్లా, ఆలయ అధికారులను ఆదేశించింది. సమీక్షా పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన కోర్టు ఆదేశాలను పాటించకుండా ఉండటానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: విజయ్‌ సర్కార్‌కు హైకోర్టులో షాక్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement