నక్సల్బరీ నోట్స్‌: నవంబర్‌ 2026 | There is no comparison between Naxalbari sixty years ago and now | Sakshi
Sakshi News home page

నక్సల్బరీ నోట్స్‌: నవంబర్‌ 2026

Nov 25 2026 3:35 AM | Updated on Nov 25 2026 3:35 AM

There is no comparison between Naxalbari sixty years ago and now

అరవై ఏండ్ల కిందటి నక్సల్బరీకి, ఇప్పటికి ఏ విధంగానూ పోలికలు లేవు. లేదా ఇంచుమించుగా లేవు. ఊరికి, ప్రజలకు, ఆర్థికా నికి, రాజకీయానికి కూడా. అదే సమయంలో ఒకప్పటి నక్సల్బరీ నీడలు ఏదో ఒక మేరకు దోబూచులాడుతున్నట్లే కనిపిస్తాయి.అపుడు ఒక పెద్ద గ్రామంగా ఉండిన నక్సల్బరీ ఇప్పుడొక చిన్న పట్టణంగా పెరిగింది. ఇంకా లోపలకు ప్రవేశించకముందే అది తెలిసిపోతుంది. బాగుపడిన రోడ్లూ, రకరకాల వాహనాల రద్దీ, జన సమ్మర్దం, చిన్నాపెద్దా వ్యాపారాలు ఒకవైపు; పెద్ద పోలీస్‌ స్టేషన్, ఫైర్‌ స్టేషన్, పంచాయతీ మండల కార్యాలయాలు, పలు విద్యాసంస్థలతో పాటు నక్సల్బరీ పేరుతోనే ఏర్పాటైన ‘నక్సల్బరీ కాలేజ్‌’, రైల్వేస్టేషన్‌ మరొకవైపు. అప్పటి పదివేల జనాభా ఇపుడు లక్ష దాటింది. బయటినుంచి వచ్చి పోయేవారు సరేసరి.

ఉద్యమం ఎందుకు తలెత్తింది?
1960లలో పేద రైతులు, కూలీలు తిరుగుబాటు అయితే చేశారుగానీ ఈ మొత్తం డార్జిలింగ్‌ జిల్లా గానీ, సిలిగుడి డివిజన్‌ గానీ, నక్సల్బరీ మండలం గానీ వెనుకబడిన ప్రాంతం కాదు. అన్నీ సారవంతమైన భూములు. నీటికి కొరత లేదు, రకరకాల పంటలు, విస్తారమైన తేయాకు తోటలతో సుభిక్షమైన ప్రాంతమిది. అప్పుడు, ఇప్పుడు కూడా. సమస్య తలెత్తటానికి కారణం భూములు అత్య ధికం భూస్వాములు, జోతేదార్ల చేతిలో కేంద్రీకృతం కావటం, కౌలుదార్లను, కూలీలను పీడించటం. తేయాకు తోటలు స్వదేశీ, విదేశీ యజమానుల అధీనంలో ఉండి కూలీల జీవితాలు దుర్భరంగా సాగుతుండటం.

తిరుగుబాటు తర్వాత ఈ సమస్యలు తగినంత మారటంతో జీవితాలు సజావుగా సాగుతున్నాయి. పిల్లలంతా చదువుకుంటు న్నారు. ఒకమేర చదివి, తమకు కొత్తగా స్వాధీనంలోకి వచ్చిన భూములను తల్లిదండ్రులతో పాటు సాగు చేసుకుంటున్నవారుకొందరు కాగా, మరికొందరు నక్సల్బరీ పట్టణంలో వ్యాపారాలు చేస్తున్నారు. అయితే, వారివి, ఇతర స్థానికులవి అధిక భాగం చిన్న వ్యాపారాలే. పెద్దవి నడుపుతున్న వారిలో అధికులు బయటివారు. 1960ల తర్వాత ఇప్పటికి రెండు తరాలు గడిచాయి. రెండవ తరం ప్రవేశించే సరికి సిలిగుడి, కలకత్తా వంటి చోట్ల ఏదో ఒకస్థాయిలో చదివినవారు, నైపుణ్యాలు సంపాదించినవారు ప్రభుత్వంలో, ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు పొందారు. వీరికి గతం గురించి తెలిసింది స్వల్పం.

రాజకీయ మార్పులు
తిరుగుబాటు ఆరంభ దశలోనే అణగిపోయిన తర్వాత, అంత కన్న ముఖ్యంగా కౌలుదార్లూ కూలీల సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారమైనాక, ఇక కొత్త తరాలు ఉద్యమంవైపు మళ్లక పోవటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, తమకు కొత్తగా పట్టాలు లభించిన భూములను వారు సాగు చేసుకోవటం కాగా, రెండవది పైన చెప్పిన చదువులు, ఉద్యోగ ఉపాధుల మార్పులు. వారు సాధారణ రాజకీ యాలలోకి విరివిగా ప్రవేశించటాన్ని మూడవదిగా చెప్పవచ్చు. రాజ కీయ ప్రవేశాలు రెండు విధాలుగా జరిగాయి. మొదటి సీపీఐ(ఎంఎల్‌) పలు గ్రూపులుగా చీలిపోయి, వాటిలో ఎక్కువ గ్రూపులు ఎన్నికల రాజకీయాలలో ప్రవేశించాయి. రెండవది, అనేకులుసీపీఐ, సీపీఎం వంటి పార్లమెంటరీ లెఫ్ట్‌లోనే గాక, తృణమూల్, బీజేపీల్లోనూ చేరారు.

ఈ ప్రాంతపు అసెంబ్లీ, లోక్‌సభ నియోజక వర్గాలు చిరకాలం లెఫ్ట్‌ ఫ్రంట్, ఆ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ అధీనంలో ఉండిన తర్వాత ఇప్పుడు బీజేపీ గెలుస్తున్నది. అది కూడా భారీ ఆధిక్యతతో. అందుకు చాలామంది చెప్తున్న కారణం, అభివృద్ధి బాగా జరుగుతుందనే ఆశాభావం. అదిగాక, హిందూ–ముస్లిం ప్రచార ప్రభావం కూడా బాగా పనిచేసినట్లు తోచింది. సీపీఎం డాక్టర్‌ ఒకరు ఈ కారణంగా తాను బీజేపీకి ఓటు వేస్తున్నానని చెప్పాడు. నక్సలైట్‌ తిరుగుబాటు వచ్చి, వామ పక్షాలూ, తృణమూల్‌ పాలించిన చోట్ల ఈ తరహా మార్పు ఆశ్చర్యాన్ని కలిగించేదే. అందుకు కారణాలను జాగ్రత్తగా శోధించటం అవసరం.

ఇంకా ఆశ మిగిలేనా?
బీజేపీ బలం 2024 ఎన్నికల నుంచి క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తున్నందున పశ్చిమ బెంగాల్‌లోనూ అట్లా జరిగితే ఎవరికి అవ కాశం ఉండవచ్చునన్న ప్రశ్నకు అందరూ లెఫ్ట్‌ ఫ్రంట్‌ అన్న సమా ధానమే ఇచ్చారు. కాంగ్రెస్‌ను ఎవరూ లెక్కించటం లేదు. తృణ  మూల్‌ పాలనలో అభివృద్ధి జరిగిన మాట నిజమే అయినా, మమతా బెనర్జీకి వయసు మీరుతూ ఆ తర్వాతి నాయకత్వ తరం అంటూ ఎదగక పోవటాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. మరొకవైపు లెఫ్ట్‌ ఫ్రంట్‌లోని వేర్వేరు పార్టీలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాయనీ, అదేపని నక్సల్బరీ ప్రాంతంలోనూ జరుగుతున్నదన్నదనే మాటలు వినిపించాయి. 

సీపీఐ(ఎంఎల్‌) గ్రూపులకు సంబంధించి ఎన్నికలలో పాల్గొంటున్నవి, వ్యతిరేకిస్తున్నవి కూడా ఉన్నాయి. వాటిలో అన్నింటికన్న పెద్దది లిబరేషన్‌ గ్రూపు. ఆ పార్టీ పక్షాన నక్సల్బరీ ప్రాంతంతో పాటు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ముఖ్యులైన విప్లవ నాయకులు పోటీలు చేశారు గానీ గెలవలేదు. బిహార్‌లో మాత్రం ముగ్గురు శాసనసభ్యులున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య. చారు మజుందార్‌ కుమారుడు అభిజిత్‌ మజుందార్‌ రాష్ట్ర నాయకుడు. కాక్రోచ్‌ ఉద్యమ సందర్భంగా ప్రాచుర్యంలోకి వచ్చిన నేహా బోరా ఈ పార్టీ విద్యార్థి నాయకురాలే. ఆమె వచ్చే ఎన్నికలలో పోటీ చేయవచ్చునా? అది పార్టీ నిర్ణయమన్నారు నక్సల్బరీ నాయకులు.

నక్సల్బరీలో ఆశ్చర్యం కలిగించింది విప్లవ నాయకుల విగ్ర హాలు. ఒక వీధికి ‘చారు మజుందార్‌ సారణి’ అని పేరు పెట్టి, ఒక చోట మార్క్స్, మావో, చారు మజుందార్‌ సహా తొమ్మిదిమంది నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అదే వీధిలో కొంత దూరాన ఒక స్మారకంపై, 1967 మే 25న అదే స్థలంలో ఎనిమిదిమంది మహిళలు, ఇద్దరు పిల్లలు, ఒక మగమనిషి పోలీసు కాల్పుల్లో అమ రులయారనీ, ఆ ఘటన భారత విప్లవోద్యమానికి ఒక మలుపు అయిందనీ రాశారు. విశేషమేమంటే, వీటిని నేటికీ ప్రభుత్వాలు కూల్చలేదు. ఆ పని చేయబూనితే తీవ్ర వ్యతిరేకత రాగలదు గనుక ఆ జోలికి పోలేదని విన్నాను. అదే విధంగా ఒక చోట ‘తియెన్‌ ఆన్‌మన్‌ స్క్వేర్‌’ అంటూ బోర్డు పెట్టారు. ఆ ఘటన జరిగింది (1989) మావో తర్వాత తెంగ్‌ శియావ్‌ పింగ్‌ హయాంలో. తెంగ్‌ను మావో పార్టీ నుంచి బహిష్కరించారు గనుక నక్సల్బరీ మావోయి స్టులు, అక్కడి యువతరం ఆ తిరుగుబాటును సమర్థించారు.అందుకే ఈ బోర్డు.

ఇన్ని నిర్బంధాలు, నిషేధాల మధ్య కూడా ఆ ప్రాంతంలోఎంఎల్‌ పార్టీల కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి. కొన్ని తాజా పోస్టర్లు కూడా గమనించాను. నాయకులు సమావేశాల కోసం తరచూ కోల్‌కతా వెళుతున్నారు. కానీ, నక్సల్బరీ పట్టణంలో గానీ, గ్రామాలు, గిరిజన ఆవాసాలలో గానీ అంతా పరిమితంగానే. ప్రధా నంగా కనిపించేది కొత్త తరాలకు కొంత సానుభూతి ఉన్నా క్రియా శీలంగా లేకపోవటం. విప్లవం రాక తప్పదనీ, అయితే కొత్త తరా లను ఆకర్షించేందుకు వారికి సంబంధించిన వర్తమాన సమస్యలను గుర్తించవలసి ఉందనీ గత కాలపు విప్లవకారులన్నారు. అటువంటి సమస్యలు ఏమిటన్నది మాత్రం ఇంకా గుర్తించాల్సి ఉంది.

– టంకశాల అశోక్‌ ‘ సీనియర్‌ సంపాదకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement