వేడిని తగ్గించలేకపోతే వాడుకోగలగాలి! | Solar Energy Synthetic Fuel Global Warming | Sakshi
Sakshi News home page

వేడిని తగ్గించలేకపోతే వాడుకోగలగాలి!

Nov 24 2026 8:12 AM | Updated on Nov 24 2026 8:12 AM

Solar Energy Synthetic Fuel Global Warming

శిలాజ ఇంధనాలపై ఆధారపడకుండా సూర్యరశ్మిని ఉపయోగించి కార్బన్‌ డై ఆక్సైడ్‌ (సీఓ2), నీటి ద్వారా... పెట్రోల్, డీజిల్‌ వంటి ఇంధనాలను తయారు చేసే పద్ధతులను అభివృద్ధి చేయడం అత్యవసరం. భూమిపై ఇంధనం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, జీవావ రణం, జీవన విధానాలను సుస్థిరం చేయడానికి, అలాగే ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన ‘17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను’, ‘భారత జాతీయ అభివృద్ధి లక్ష్యాలను’ సాధించడానికి ఇది ఎంతో కీలకం.

ముడి చమురు, బొగ్గు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలను విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రతి ఏటా రూ‘‘ లక్షల కోట్లను వెచ్చిస్తోంది. అదే మొత్తాన్ని వెచ్చించి సూర్యరశ్మి, గాలి, నీటి నుండి పెట్రోల్, డీజిల్‌ను తయారు చేసే మౌలిక సదుపాయాలను భారతదేశంలోనే ఏర్పాటు చేయ వచ్చు.

కృత్రిమ పెట్రోల్, డీజిల్‌లను తయారు చేసే ప్రక్రియలో, పారిశ్రామిక స్థాయిలో ఆర్థికంగా లాభదాయకమైన సామర్థ్యాన్ని సాధించడానికి ‘సిలికాన్‌ ఫోటోవోల్టాయిక్‌’ (ఎస్పీవీ) సోలార్‌ ప్యానెళ్ల వినియోగం తప్పనిసరి. అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఎస్పీవీ సోలార్‌ ప్యానెళ్లు 20% విద్యుత్తును, సుమారు 40% వేడిని ఉత్పత్తి చేస్తున్నాయి. కాబట్టి ఈ సోలార్‌ ప్యానెళ్లు, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికీ, తద్వారా వాతావరణ మార్పులకూ కారణమవుతున్నాయి.

నేడు వర్షపాతం తగ్గడానికి... మేఘ విస్ఫోటనాలు (క్లౌడ్‌ బరస్ట్స్‌), కొండచరియలు విరిగిపడటం, వరదలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడానికి ‘ఎల్‌ నినో’ కారణమని భావిస్తున్నారు. సూర్యరశ్మికి పసిఫిక్‌ మహాసముద్రపు నీటికి మధ్య జరిగే పరస్పర చర్య వల్ల ఎల్‌ నినో ఏర్పడుతుంది. ఇది గత 5,000 నుండి 10,000 ఏళ్లుగా ఉంటూనే ఉంది. మరోవైపు, భూగోళం వేడెక్కడం, వాతావరణ మార్పులు, పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాతే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వాస్తవానికి, సీఓ2 నేరుగా సూర్యరశ్మిని గ్రహించి భూమిని వేడెక్కించదు. సూర్యరశ్మి భూమి ఉపరితలంపై పడినప్పుడు, కాంక్రీటు భవనాలు, తారు రోడ్లు, లోహపు షెడ్లు వంటి వాటి ద్వారా అది ఉష్ణ తరంగాలుగా మారుతుంది. థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, సిమెంట్‌ పరిశ్రమలు, ఉక్కు కర్మాగారాలు, ఇతర పరిశ్రమలలో, శిలాజ ఇంధనాలను మండించే వాహనాల ద్వారా కూడా అధిక వేడి ఉత్పత్తి అవుతుంది.

ఇలా వెలువడిన ఉష్ణ తరంగాలను వాతావరణంలోని సీఓ2 అడ్డుకోవడం వల్ల భూగోళం వేడెక్కుతుంది. ఒకవేళ వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ లేకపోతే, ఈ ఉష్ణ తరంగాలు అంతరిక్షంలోకి వెళ్లిపోతాయి, తద్వారా భూగోళం వేడెక్కదు. కాబట్టి, భూగోళం వేడెక్కడాన్ని నివారించాలంటే, సూర్యరశ్మి వల్ల లేదా శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా ఉత్పన్నమయ్యే వేడిని వీలైనంత తగ్గించడమే అత్యంత ముఖ్యమైన చర్య.

అందువల్ల గ్లోబల్‌ వార్మింగ్, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటిని నివారించడానికి, ఎస్పీవీ సోలార్‌ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని వాతావరణంలోకి విడుదల చేయకుండా, దానిని పూర్తిగా బంధించి సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా నేడు ఏర్పాటు చేసిన సంప్రదాయ ఎస్పీవీ సోలార్‌ ప్యానెళ్లను ఉపయోగించి, పర్యావరణానికి హాని కలగకుండా సూర్యరశ్మి, గాలి, నీటి నుండి సింథటిక్‌ పెట్రోల్, డీజిల్‌లను ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. కాబట్టి, ఎస్పీవీ సోలార్‌ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని బంధించేలా వాటిని సవరించడం తప్పనిసరి.
– డా. ఇబ్రం గణేశ్‌, శాస్త్రవేత్త

ఇదీ చదవండి: తొలి ఫ్లైట్‌ సర్జన్‌ ఎయిర్‌ మార్షల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement