పునర్వినియోగంతోనే జలభద్రత | Water security through reuse | Sakshi
Sakshi News home page

పునర్వినియోగంతోనే జలభద్రత

Nov 22 2026 3:59 AM | Updated on Nov 22 2026 3:59 AM

Water security through reuse

అభిప్రాయం

మానవ నాగరికత వికాసానికి నీరే మూలాధారం. నదీ తీరాల్లోనే తొలి నాగరికతలు పురుడు పోసుకున్నాయి. వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, వాణిజ్యం, పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధి... ఇలా మానవ జీవన ప్రస్థానంలోని ప్రతి ప్రగతి ఘట్టానికి నీరే ఆధారం. నేడు జనాభా పెరుగు దల, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పుల కారణంగా నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతున్నది. మానవాళి విచక్షణారహిత కార్యకలాపాలు, పర్యావరణంపై నిర్లక్ష్యం కారణంగా నదులు, చెరువులు, ఇతర జలవనరులు కాలుష్య కోరల్లో చిక్కుకుని జీవజాల మనుగడకు సవాలుగా మారు తున్నాయి. ఈ పరిస్థితుల్లో నీటిని పొదుపు చేయడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పునరుద్ధరించడం వంటి చర్యలతో పాటు వినియోగించిన నీటిని శుద్ధి చేసి పునర్వినియోగించడం నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రపంచానికి ఒక కీలక ప్రత్యామ్నాయ నీటి వనరుగా మారింది.

నీతి ఆయోగ్‌ (2023) నివేదిక ప్రకారం, భారత పట్టణ ప్రాంతాల్లో రోజుకు సుమారు 72,368 మిలియన్‌ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతున్నది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) 2021 గణాంకాల ప్రకారం, దేశంలోని 1,469 ఎస్టీపీల మొత్తం స్థాపిత సామర్థ్యం 31,841 ఎమ్‌ఎల్‌డీ కాగా, అందులో 26,869 ఎమ్‌ఎల్‌డీ సామర్థ్యం మాత్రమే నిర్వహణలో ఉంది. వాస్తవంగా రోజుకు 20,235 ఎమ్‌ఎల్‌డీ మురుగునీరు మాత్రమే శుద్ధి అవుతున్నది. 

అంతేకాకుండా, శుద్ధి చేసిన నీటిలో రోజుకు 1,000 ఎమ్‌ఎల్‌డీ కంటే తక్కువ మాత్రమే పునర్వినియోగం అవుతున్నట్లు నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆర్థిక సర్వే 2025–26 లోని ‘అర్బనైజేషన్‌: మేకింగ్‌ ఇండియాస్‌ సిటీస్‌ వర్క్‌ ఫర్‌ ఇట్స్‌ సిటిజన్స్‌’ అధ్యాయం దేశంలో రోజుకు సుమారు 112 బిలియన్‌ లీటర్ల గృహ, పారిశ్రామిక మురుగునీరు ఉత్పత్తి అవుతున్నట్లు స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే మురుగునీటిలో కేవలం 28 శాతం మాత్రమే శుద్ధి అవుతుండగా, నగరాల్లో శుద్ధి చేసిన నీటిలోనూ కేవలం 8 శాతం మాత్రమే తిరిగి పునర్వినియోగంలోకి వస్తున్నది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం ద్వారా నీటి వనరులపై ఒత్తిడిని తగ్గించి, భవిష్యత్తు నీటి అవసరాలను తీర్చుకోవాల్సిన పరిస్థితి నెల కొన్నది. విశ్వనగరంగా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్‌ వంటి మహానగరం పునర్వినియోగ జలాలను ఒక కీలక ప్రత్యా మ్నాయ జలవనరుగా మలచుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మాణ రంగం, పార్కులు, గార్డెనింగ్, రోడ్ల శుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు, తాగునీటియేతర అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడిని తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

నగరంలోని ఎస్టీపీలను పూర్తి సామ ర్థ్యంతో నిర్వహించడం, ప్రైవేట్‌ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించడం, డేటా సెంటర్లకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడంద్వారా పునర్వినియోగాన్ని విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఈ చర్యలతో నదులు, చెరువులు, జలాశయాలు, భూగర్భ జలాలపై ఆధారపడటం తగ్గి, స్వచ్ఛమైన నీటిని ప్రత్యేకించి తాగునీటి అవసరాలకు వాడు కోవడానికి సాధ్యపడుతుంది. శుద్ధి చేసిన నీటి వినియోగంతో పరిశ్రమల వ్యయాలు తగ్గడంతో పాటు, వనరులను తిరిగి వినియోగించుకునే ‘వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్‌ ఎకానమీ) బలోపేతమవుతుంది.

సమగ్ర జల నిర్వహణ వ్యూహం
జలభద్రతను భవిష్యత్తు అవసరంగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, చెరువుల పరిరక్షణ, సాగునీటి వన రుల సమర్థ నిర్వహణకు ప్రాధాన్యాన్నిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ‘గ్రీన్‌ వాటర్‌ ట్యాంకర్‌’ కార్యక్రమం ద్వారా ఎస్టీపీలలో శుద్ధి చేసిన నీటిని తాగునీటియేతర అవసరాలకు అందుబాటులోకి తెచ్చింది. మురుగునీటి శుద్ధి, పునర్వినియోగ వ్యవస్థలు సమర్థవంతంగా పని చేయడంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కీలకమైన నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నది. ఎస్టీపీల నుంచి విడుదలయ్యే శుద్ధి చేసిన నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించడంతోపాటు, నిర్ణీత పర్యావరణ ప్రమాణాలు అమలవుతున్నాయా లేదా నిరంతరం తనిఖీ చేస్తుంది.
సంబంధిత సంస్థలకు అవసరమైన అనుమతులు మంజూరు చేయడం, పర్యావరణ ఉల్లంఘనలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం ద్వారా శుద్ధి ప్రక్రియ ప్రమాణాలకు అనుగుణంగా జరిగేలా చూస్తున్నది.

ఎల్‌ నినో, లా నినా వంటి సహజ వాతావరణ దృగ్వి షయాలు వర్షపాతం, ఉష్ణోగ్రతల తీరును ప్రభావితం చేస్తూ జలవనరుల లభ్యత, నిర్వహణకు కొత్త సవాళ్లను విసురుతుంటాయి. ఈ పరిస్థితుల్లో వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, భూగర్భజలాల పెంపు, మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగాన్ని సమగ్ర జల నిర్వహణ వ్యూహంలో భాగం చేయాలి.నీటి పొదుపు, పునర్వినియోగాన్ని జీవన విధానంలో, అభివృద్ధి ప్రణాళికల్లో భాగం చేసినప్పుడే ప్రస్తుత అవసరాలు తీరడంతోపాటు భవిష్యత్తు తరాలకు జలభద్రతను అందించ గలం.

-వ్యాసకర్త ఐఏఎస్, మెంబర్‌ సెక్రటరీ,తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి
-జి.రవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement