ఇంకా బీమారు రాష్ట్రాలుగానే ఉంటాయా? | The term Bimaru was used in 1985 | Sakshi
Sakshi News home page

ఇంకా బీమారు రాష్ట్రాలుగానే ఉంటాయా?

Nov 20 2026 3:39 AM | Updated on Nov 20 2026 3:40 AM

The term Bimaru was used in 1985

అభిప్రాయం

జనాభా సంబంధిత సమస్యలు, సామాజిక–ఆర్థిక వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 1985లో ‘బీమారు’  అనే పదాన్ని ఉపయోగించారు. ఆయా రాష్ట్రాలలో పేదరికమనేది ప్రధాన సమస్యగా ఉన్నప్పటికీ, అధిక జనాభావృద్ధి, అల్ప మానవ మూలధనం, అల్ప ఉత్పాదకత, తక్కువ మహిళా విద్య, పరిమిత కుటుంబ వనరులు, అధిక శిశు మరణాలు, అల్ప అక్షరాస్యత లాంటి నిర్మాణాత్మక సమస్యలను ఆ యా రాష్ట్రాలు ఎదుర్కొన్నాయి. గత 4 దశాబ్దాల కాలంలో ఆ రాష్ట్రాల ఆర్థిక, సామాజిక పరిస్థితులలో గణనీయమైన మార్పులు సంభవించాయి. దక్షిణ, పశ్చిమ భారత్‌లోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే తలసరి ఆదాయం, పేదరిక నిర్మూలన, నాణ్యమైన ఉపాధిలో సమానమైన పురోగతిని ఆ యా రాష్ట్రాలు సాధించగలిగాయా అనేవి ప్రస్తుతం కీలక ప్రశ్నలుగా మిగిలాయి. 

1990వ దశకంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన సగటు వార్షిక వృద్ధితో పోల్చినప్పుడు (6.5 శాతం), బీమారు రాష్ట్రాలలో వార్షిక వృద్ధి 4.6 శాతం మాత్రమే నమోదయింది. వ్యవసాయ ఆధారిత వ్యవస్థలైన ఈ రాష్ట్రాలు పారిశ్రామిక రంగంలో అధిక పెట్టుబడులను ఆకర్షించలేకపోవడం, తక్కువ భౌతిక మౌలిక సదు పాయాలు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లాంటి సమస్యలువృద్ధిరేటు క్షీణతకు కారణాలుగా నిలిచాయి.

2001–02 నాటికి దేశ సగటు తలసరి ఆదాయంలో బీమారు రాష్ట్రాల సగటు తలసరి ఆదాయం 55–60 శాతం మాత్రమే నమో దైంది. 2001 సెన్సెస్‌ ప్రకారం దేశ జనాభాలో 41 శాతం వాటాను కల్గిన ఈ రాష్ట్రాలలో, దేశంలో దారిద్య్ర రేఖ దిగువన నివసించే జనా భాలో సుమారు 48 శాతం పేద ప్రజలు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్య ప్రదేశ్‌లో నివసించారు. రాజస్థాన్ ను మినహాయించి మిగిలిన 3 రాష్ట్రాలలో అక్షరాస్యత జాతీయ సగటుకన్నా తక్కువగా ఉండటంతో పాటు, ప్రసూతి మరణాలు, సంతానోత్పత్తి రేటు (బిహార్‌ 4.4, మధ్యప్రదేశ్‌ 3.9, రాజస్థాన్  4.0, ఉత్తరప్రదేశ్‌ 4.5), శిశు మర ణాల రేటు జాతీయ సగటుకన్నా అధికంగా నమోదయ్యాయి.

సమగ్ర అభివృద్ధిలో కీలకం
భారత్‌ సమగ్ర అభివృద్ధిలో బీమారు రాష్ట్రాలు కీలకమైనందువలన కేంద్ర ప్రభుత్వం ఆ యా రాష్ట్రాలలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి, ఆర్థిక సమ్మిళితత్వం, పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల ప్రోత్సాహం, సామా జిక సంక్షేమంపై దృష్టి సారించింది. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన (2000) ద్వారా రోడ్ల కనెక్టివిటీ పెంపుతో పాటు ఎక్స్‌ప్రెస్‌ వేలు, సరకు రవాణా కారిడార్ల అభివృద్ధిని ప్రభుత్వం చేపట్టింది. 

112 ఆకాంక్షాత్మక జిల్లాలు, 500 ఆకాంక్షాత్మక మండలాల కార్య క్రమాలలో అధిక భాగాన్ని బీమారు రాష్ట్రాలలోనే గుర్తించి ప్రాథమిక సేవలను మెరుగుపరిచారు. జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, స్వచ్ఛ భారత్‌ మిషన్, ప్రధానమంత్రి జన్ ధన్  యోజన (2014) ద్వారా ఆర్థిక సమ్మిళితత్వం సాధ్యమయింది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 41.88 శాతం, 16వ ఆర్థిక సంఘం ప్రకారం 40.85 శాతం కేటాయింపులతో పాటు గ్రాంట్లు, మూలధన పెట్టు బడుల సహాయాన్ని బీమారు రాష్ట్రాలు పొందాయి.

గత రెండున్నర దశాబ్దాల కాలంలో మౌలిక సదుపాయాలు, పరిపాలనా సంస్కరణలను వేగవంతం చేయడం ద్వారా బీమారు రాష్ట్రాలు తమ జి.ఎస్‌.డి.పి. వృద్ధిని పెంచుకోగలిగాయి. బిహార్‌ బాలికల విద్యకు; మధ్యప్రదేశ్‌ సాగునీరు, విద్యుత్‌ సరఫరాకు; రాజస్థాన్  సౌర–పవన విద్యుత్, పర్యాటక రంగానికి; ఉత్తరప్రదేశ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలు, పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చాయి.

తలసరి ఆదాయం (2001–02 నుండి 2025–26 నాటికి ప్రస్తుత ధరల వద్ద): బిహార్‌: రూ. 6,200 నుండి రూ. 76,490, మధ్యప్రదేశ్‌: రూ. 12,697 నుండి రూ. 1,69,050, రాజస్థాన్ : రూ. 14,098 నుండి రూ. 2,02,349, ఉత్తరప్రదేశ్‌: రూ. 11,034 నుండి రూ. 1,20,000కు పెరిగింది. ఇక ఆర్థిక వృద్ధి రేటు (2024–25)ను చూస్తే– బిహార్‌ 13.07%, మధ్యప్రదేశ్‌ 10.53%, రాజస్థాన్  12.23%, ఉత్తరప్రదేశ్‌ 12.64% సాధించాయి.

పేదరిక నిర్మూలన (2013–14 నుండి 2022–23) విషయానికి వస్తే... నీతి ఆయోగ్‌ అంచనా ప్రకారం బహుముఖ పేదరికం నుండి ఉత్తరప్రదేశ్‌లో 5.94 కోట్లు, బిహార్‌లో 3.77 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 2.30 కోట్లు, రాజస్థాన్ లో 1.87 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. ఆయుఃప్రమాణం పెరగడంతో పాటు శిశు మరణాల రేటు, సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గాయి. నీతి ఆయోగ్‌ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచీ 2026 ప్రకారం 18 రాష్ట్రా లలో ఉత్తరప్రదేశ్‌ 8వ, మధ్యప్రదేశ్‌ 10వ, బిహార్‌ 12వ, రాజస్థాన్‌ 14వ స్థానాల్లో నిలిచాయి.

భవిష్యత్‌ వ్యూహం
బీమారు రాష్ట్రాల జీఎస్‌డీపీలో సేవారంగ వాటా అధికంగా ఉండి, సేవారంగ ఆధారిత వ్యవస్థలుగా రూపొందినప్పటికీ, ఉపాధి పెంపులో తయారీ రంగం వెనుకబడటాన్ని గమనించాలి. నీతి ఆయోగ్‌ ఎస్‌డీజీ సూచీ (2023–24) ప్రకారం జాతీయ సగటు స్కోరుతో పోల్చినప్పుడు తక్కువ అక్షరాస్యత, అధిక జనన మరణ రేట్లు, అధిక సంతానోత్పత్తి రేటు, అధిక పేదరిక స్థాయి, మాధ్యమిక పాఠశాలల్లో విద్యా నాణ్యత తక్కువగా ఉండటంతో పాటు తదుపరి తరగతులకు విద్యార్థుల పురోగతికి సంబంధించిన సమస్యలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

వేగవంతమైన అభివృద్ధి నుండి సమగ్ర మానవాభివృద్ధిని సాధించే దిశగా ఈ రాష్ట్రాలు భవిష్యత్‌ వ్యూహాన్ని రూపొందించు కోవాలి. కేంద్ర ప్రభుత్వం నుండి లభించే ఆర్థిక వనరులను ఉత్పాదక పెట్టుబడులుగా మార్చాలి. ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పన, మానవాభివృద్ధి, ఉత్పాదకత పెంపు, పరిపాలనా సామర్థ్యంపై దృష్టి సారించినప్పుడే ఈ రాష్ట్రాలు సుస్థిర అభివృద్ధిని సాధించ గలుగుతాయి.

-వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు
-డా‘‘ తమ్మాకోటిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement