అల్వార్: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా విద్యావ్యవస్థపై ఆ రాష్ట్ర గవర్నర్ హరిభావు బాగ్డే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో సుమారు 18 వేల మంది విద్యార్థులు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరుకాగా, కేవలం 14 మంది మాత్రమే విజయం సాధించారని ఆయన తెలిపారు. ఈ గణాంకాలు విద్యాబోధన నాణ్యతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు.
జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ.. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను కేవలం పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులుగా తయారుచేయడం మాత్రమే విద్యావ్యవస్థ లక్ష్యం కాకూడదని స్పష్టం చేశారు. వారిలో మేధో సామర్థ్యం, విచక్షణ, తార్కిక ఆలోచనలను పెంపొందించాలని సూచించారు.
విద్యార్థుల్లో ప్రశ్నలు అడగడం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే సహజ ఆసక్తి ఉంటుందని గవర్నర్ అన్నారు. ఉపాధ్యాయులు ఆ జిజ్ఞాసను అణచివేయకుండా ప్రోత్సహించాలని సూచించారు. కేవలం బట్టీ పట్టి పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలకాలని పేర్కొన్నారు. నీట్, జేఈఈతో పాటు ఆర్‌పీఎస్‌సీ, యూపీఎస్‌సీ వంటి కఠినమైన పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులు విజయం సాధించేలా తీర్చిదిద్దాలని చెప్పారు.
విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాల్లో తనకు ఎదురైన అనుభవాలను కూడా గవర్నర్ ప్రస్తావించారు. డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థుల్లో ఆర్‌పీఎస్‌సీ, యూపీఎస్‌సీ పరీక్షలు రాయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారని అడిగితే.. చాలా తక్కువ మంది మాత్రమే చేతులెత్తుతున్నారని తెలిపారు. డిగ్రీలు పొందడం వేరు.. నిజమైన విద్యా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం వేరని ఈ పరిస్థితి తెలియజేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ విద్యావ్యవస్థ వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
విద్యతో పాటు ఆరోగ్య, సామాజిక అంశాలపైనా గవర్నర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అల్వార్‌ను వీలైనంత త్వరగా క్షయ వ్యాధి (టీబీ) రహిత జిల్లాగా మార్చేందుకు ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. నషాముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా జిల్లాను మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో గురునానక్ బోధనలు!


