దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దుస్తుల షోరూమ్‌లో పనిచేస్తున్న 18 ఏళ్ల యువతిని గుర్తుతెలియని వ్యక్తి హత్య చేశాడు. షోరూమ్‌లోని ట్రయల్ రూమ్‌లోనే ఆమె గొంతు కోసి చంపాడు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వన్ సైడ్ లవ్, విభేదాలు హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతురాలిని షబ్నమ్‌గా గుర్తించారు. ఆమె మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ దుస్తుల షోరూమ్‌లో పనిచేస్తోంది. పశ్చిమ ఢిల్లీలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నిందితుడు షబ్నమ్‌కు ముందే పరిచయమున్న వ్యక్తి. గతంలో ఇద్దరూ స్నేహితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం షబ్నమ్ పని ముగించుకుని వెళ్లే సమయంలో నిందితుడు షోరూమ్‌కు వచ్చాడు. ఆమెను ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి, పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
కొంతకాలంగా ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే వ్యక్తిగత విభేదాలు హత్యకు దారితీసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన షోరూమ్ మూసే సమయంలో వెలుగులోకి వచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో షోరూమ్ సిబ్బంది దుకాణం మూసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ట్రయల్ రూమ్‌లను తనిఖీ చేయగా.. షబ్నమ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలను గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరో వైపు, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడు షోరూమ్‌లోకి వచ్చిన సమయం, అక్కడి నుంచి వెళ్లిన మార్గాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..


