ఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న గంగా జలాల పంపిణీ ఒప్పందాన్ని పునరుద్ధరించకుండా గడువు ముగిసేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. 1996లో కుదిరిన ఈ ఒప్పందం 2026 డిసెంబర్ 12తో ముగియనుంది. ఒప్పందాన్ని యథాతథంగా కొనసాగించకుండా కొత్త నిబంధనలతో చర్చలు జరపాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాల మేరకు.. ఒప్పందం గడువు ముగిసినప్పటికీ బంగ్లాదేశ్‌కు ఇప్పటివరకు కేటాయిస్తున్న నీటి వాటాను కొనసాగించాలని భారత్ భావిస్తోంది. అయితే కొత్త ఒప్పందంలో భారత్‌కు మరింత నీరు అందేలా నిబంధనలను మార్చాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పోర్టు కార్యకలాపాలు, ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాల అవసరాలు, సుందర్‌బన్స్ ప్రాంతంలో ఉప్పునీటి సమస్యలను పరిష్కరించేందుకు అదనపు నీరు అవసరమని భారత్ భావిస్తోంది.
30 ఏళ్ల క్రితం కుదిరిన ఒప్పందం..
1996 డిసెంబర్ 12న అప్పటి భారత ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య గంగా జలాల పంపిణీ ఒప్పందం కుదిరింది. పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా బ్యారేజీ వద్ద గంగా నది నీటిని ఇరు దేశాలు ఎలా పంచుకోవాలన్నది ఇందులో నిర్దేశించారు. ముఖ్యంగా ఎండాకాలంలో నీటి లభ్యత తగ్గినప్పుడు రెండు దేశాలకు నీటి పంపిణీపై ఈ ఒప్పందం మార్గదర్శకంగా ఉంది.
భారత్‌కు అదనపు నీరు ఎందుకు?
కోల్‌కతా పోర్టులో పూడికను తొలగించేందుకు, సుందర్‌బన్స్ ప్రాంతంలో ఉప్పునీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు అదనంగా కనీసం 5 వేల క్యూసెక్కుల నీరు అవసరమని భారత అధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు కూడా తమ నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఒప్పందంపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం కొత్త ఒప్పందం కోసం పట్టుబడుతోంది. ఎండాకాలంలో తమకు కచ్చితమైన నీటి వాటా లభించేలా హామీ నిబంధనలు ఉండాలని కోరుతోంది. దీంతో డిసెంబర్ 12 గడువు సమీపిస్తున్న వేళ ఇరు దేశాల మధ్య గంగా జలాల పంపిణీ అంశం కీలకంగా మారింది.
54 నదులు.. ఒక్క ఒప్పందం మాత్రమే!
భారత్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 54 ఉమ్మడి నదులు ప్రవహిస్తున్నాయి. అయితే గంగా నదీ జలాల పంపిణీకి సంబంధించి మాత్రమే 30 ఏళ్ల కాలపరిమితితో ప్రత్యేక ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ముగియడం రెండు దేశాల మధ్య నీటి సంబంధాలను కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది.
పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా బ్యారేజీ వద్ద గంగా నది నీటి ప్రవాహాన్ని బట్టి ఇరు దేశాలకు నీటిని పంపిణీ చేస్తారు. ముఖ్యంగా జనవరి 1 నుంచి మే 31 వరకు నీటి లభ్యత తక్కువగా ఉండే సమయంలో ఈ పంపిణీ కీలకంగా మారుతుంది. మార్చి 11 నుంచి మే 10 మధ్య మూడు పది రోజుల వ్యవధుల్లో భారత్, బంగ్లాదేశ్‌కు చెరోసారి 35 వేల క్యూసెక్కుల నీటిని కేటాయించే నిబంధన ఉంది.
హసీనా అంశం కూడా కీలకమేనా?
భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు గతంతో పోలిస్తే సున్నితంగా మారాయి. గంగా జలాల వివాదం కేవలం నీటి పంపిణీకే పరిమితం కావడం లేదు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా దీనిపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం, ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ కోరడం వంటి పరిణామాలతో సంబంధాలు సున్నితంగా మారాయి. మరోవైపు బంగ్లాదేశ్ ఎండాకాలంలో తమకు నీటి వాటాపై గ్యారంటీ కోరుతుండగా.. భారత్‌లో పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలు తమ నీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో 30 ఏళ్ల నాటి ఒప్పందం ముగింపు రెండు దేశాల మధ్య కొత్త నీటి దౌత్యానికి తెరలేపే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: పాక్‌లో 'ధురంధర్'.. అజ్ఞాతంలోకి హఫీజ్ సయీద్, మసూద్ అజార్


