ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా ఓ కీలక అడుగు పడింది. భారత్‌లో నవంబర్ 20–22వ తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) భేటీలో పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ పాల్గొంటారని పాక్ ప్రభుత్వం తెలిపింది. ‘నాగరికతల మధ్య సంభాషణ’అంశంపై ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి ఆనవాయితీ ప్రకారం పాక్ సహా అన్ని సభ్య దేశాలకు ఆహ్వానాలను పంపినట్లు భారత్ అక్టోబర్ 28వ తేదీన ప్రకటించింది.
‘నాగరికతల మధ్య సంభాషణలను, ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నాం’అని పాక్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. టీవీల్లో వివిధ అంశాలపై జరిగే చర్చల్లో మంత్రి ముసాదిక్ మాలిక్ ప్రభుత్వ అధికారిక వాదనలను వినిపించేందుకు వస్తుంటారు. భారత్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ద్వారా, వచ్చే ఏడాది ఇస్లామాబాద్‌లో జరగనున్న ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశం సమయానికి ఉద్రిక్తతలను తగ్గించుకోవచ్చనేది పాకిస్తాన్ ఆలోచనగా భావిస్తున్నారు. కాగా, 2025 ఏప్రిల్‌లో 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడం తెలిసిందే.


