మీకు టగ్ ఆఫ్ వార్ గురించి తెలుసా?
చాంతాడును అటు, ఇటు కొందరు లాగుతూంటారు...
ఎవరివైపు ఒరిగితే వాళ్లు గెలిచినట్లు.... భూమికి కొన్ని మైళ్ల ఎత్తులో...
ఇప్పుడు ఇలాంటిదే ఒకటి సాగుతోంది. కాకపోతే చాంతాడు స్థానంలో చలి.. ఎండ ఉన్నాయి అంతే!
అదేంటి? అర్థం కాలేదు.. అనుకుంటున్నారా? కొంచెం వివరంగా చూద్దాం. ఈ ఏడాది చర్రితలో ఎన్నడూ లేనంత తీవ్రమైన స్థాయిలో ఎల్‌నినో వచ్చిందని మనం చాలాకాలంగా వింటున్నాం. భారత్, యూరప్‌సహా అనేక దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలూ నమోదయ్యాయి. ఎండాకాలం పోయింది.. వానలు కురవలేదు.. శీతాకాలం సమీపిస్తోంది.
ఈసారి చలి తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుందనేందుకు సూచనగానో ఏమో.. కొన్ని వారాల ముందుగానే అమెరికా, యూరప్‌దేశాల్లో వారం రోజుల కిత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది... ఇది సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు పదమూడు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉండటం శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే... ఏటా జూన్ తరువాత సూర్యుడు దక్షిణార్ధగోళంలోకి వెళ్లిపోతాడని మనం చదువుకుని ఉంటాం.
సరిగ్గా ఈ సమయంతో మొదలుపెట్టి.. మళ్లీ సూర్యుడు ఉత్తరార్ధ గోళంలోకి ప్రవేశించేంతవరకూ ఉత్తరధ్రువంపైన పది నుంచి 30 మైళ్ల ఎత్తులో చల్లటిగాలులు గుమికూడుతూంటాయి. గిర్రున తిరుగుతూంటాయి. దీన్నే పోలార్ వోర్టెక్స్ అని పిలుస్తూంటారు. ఫలితంగా భూమిపై అతిశీతల పరిస్థితులు లేకుండా పోతాయి. శీతాకాలంలో నెమ్మదిగా ఈ మంచుగాలులు కిందకు దిగి ఆ ప్రాంతాన్ని చల్లబరుస్తాయి.
భూమి మిగిలిన ప్రాంతంలోని వేడి వాతావరణం ప్రభావంతో వేసవి సమయానికి పరిస్థితి సాధారణమైపోతుంది. అయితే... గిర్రున తిరిగే ఈ మంచుగాలులకు ఈ ఏడాది పెద్ద చిక్కొచ్చి పడింది. అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఫలితంగా చల్లదనం చెల్లాచెదురు కావడం మొదలైంది. పైగా ఈ గాలులు తిరిగే దిశ కూడా పూర్తిగా మారిపోయింది. చలికాలానికి ఇంకా సమయం ఉండగానే ఇలా ఎప్పుడూ జరగలేదట. 1968, 2025లలోనూ ఇలా జరిగింది కానీ... రెండు వారాల కంటే ముందే జరగడం ఇదే మొదటిసారి.
ఆర్కిటిక్ ప్రాంతంపై నుంచి చాలా ముందుగా కిందకు దిగిన మంచుగాలులు అమెరికా, యూరప్‌లకు అకస్మాత్తుగా హాయ్ చెప్పేశాయి. నులివెచ్చటి వాతావరణంలో బాగా ఎంజాయ్ చేస్తున్న ప్రజలను స్వెట్టర్లు దుప్పట్లు వెతుక్కునేలా చేశాయి. అవునా.. ఇలా నిజంగానే జరిగిందా? అనుకుంటూ శాస్త్రవేత్తలు తలలు గోక్కుంటూండగానే.. టగ్ ఆఫ్ వార్‌లో ఇంకో ఆటగాడు వచ్చేశాడు.. అదేనండి.. ఎల్‌నినో! ఈ ఏడాది మే, జూన్ నెలల నుంచి భూమధ్య రేఖకు కొంచెం పైన, కింద పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. ఈ మార్పు ఫలితంగా వాతావరణంలోకి చేరుతున్న వేడి నీటి ఆవిరి ఎక్కువవుతూ వస్తోంది.
ఈ బలీయమైన వేడి గాలులు కాస్తా... ధ్రువ ప్రాంతం నుంచి కిందకు దిగుతున్న మంచుగాలులతో ఢీకొట్టాయి. ఫలితంగా అమెరికా, యూరప్ ఉత్తర ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోయిన ఉష్ణోగ్రతలు కాస్తా రోజుల్లో మళ్లీ పుంజుకోవడం మొదలైంది. ఇక చలికాలమే అనుకుంటున్న ప్రజలకు మళ్లీ ఎండ రుచి తెలిసొచ్చింది. సాధారణంగా నవంబర్ చివరినాటికి లేదా డిసెంబర్ తొలినాళ్లలో కానీ రాని చలి ముందే రావడం.. వారం రోజుల్లోనే మళ్లీ వేడి వాతావరణం పలకరించడం ఒక రకంగా మంచు.. నిప్పు టగ్ ఆఫ్ వార్‌ను తలపించింది. ఇప్పటికైతే పోలార్ వోర్టెక్స్ గాలులు వెనక్కుతగ్గాయి కానీ.. ఇంకొన్ని వారాల్లో బలం పుంజుకుని కిందకొస్తే... ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి!!!
– సాక్షి, నేషనల్ డెస్క్


