వాషింగ్టన్: ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ఒకే వేదికపై భేటీ కానున్నారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వేదిక సదస్సు సందర్భంగా చైనాలోని షెన్‌జెన్ నగరంలో ఈ ముగ్గురు అగ్రదేశాల అధినేతలు సమావేశం కానున్నట్లు సమాచారం.
అయితే, ఈ సమావేశంపై వచ్చే వారం జరగనున్న ఈ సదస్సులో ఉక్రేనియన్ యుద్ధం, ఇరాన్ సంక్షోభం, అణ్వాయస్త్ర నియంత్రణ, కృత్రిమ మేధస్సు వంటి ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రధాన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చల కోసం ఎలాంటి అధికారిక ప్రకటన ఖరారు కాలేదు.
అమెరికా, రష్యా, చైనా దేశాలు ఒకే గొడుగు కిందకు వచ్చి ప్రపంచ భవితవ్యాన్ని నిర్ణయించే ప్రయత్నం చేయడం దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రెండవ ప్రపంచ యుద్ధం తుది దశలో ఉన్న సమయంలో (ఫిబ్రవరి 1945) అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్, బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, సోవియట్ యూనియన్ అధినేత జోసెఫ్ స్టాలిన్ ఉక్రెయిన్‌లోని యాల్టా ప్రాంతంలో సమావేశమయ్యారు.
ఆనాడు ఆ ముగ్గురు అగ్రనేతలు కూర్చుని ఐరోపా సరిహద్దులను, ప్రపంచ దేశాల ప్రభావిత ప్రాంతాలను ఎవరికివారే పంచుకున్నారు.చిన్న దేశాల ప్రయోజనాలను పట్టించుకోకుండా, కేవలం అగ్రరాజ్యాలు మాత్రమే కూర్చుని ప్రపంచ భవిష్యత్తును శాసించారనే విమర్శ ఆనాటి నుంచి ఉంది. ఇప్పుడు షెన్‌జెన్‌లో జరగబోయే ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్‌ల భేటీ కూడా సరిగ్గా అలాంటిదేనని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


