న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అత్యంత ఎత్తైన భాగంపైకి ఎక్కి, అక్కడే ప్రపోజ్ చేసుకున్న ఓ రష్యా జంటకు ఇప్పుడు బహిష్కరణ ముప్పు ఎదురైంది. ఏంజెలా నికోలావ్ (33), ఇవాన్ కుజ్నెత్సోవ్ (32) గత జూలైలో ఈ సాహసానికి పాల్పడ్డారు. భవనంపై రష్యా జెండాను ప్రదర్శిస్తూ.. 'ప్రేమ శక్తి, అధికారం పట్ల వ్యామోహాన్ని అధిగమించినప్పుడు, ప్రపంచానికి శాంతి లభిస్తుంది' అనే సందేశాన్ని ఇచ్చారు. అనంతరం ఇవాన్.. ఏంజెలాకు ప్రపోజ్ చేశాడు.
అయితే ఈ ఘటనపై నమోదైన కేసులో ప్రాసిక్యూటర్లతో కుదుర్చుకున్న ఒప్పందం చివరి నిమిషంలో రద్దయినట్లు ఫాక్స్ న్యూస్ కథనం వెల్లడించింది. నవంబర్ 12న న్యూయార్క్ క్రిమినల్ కోర్టులో విచారణకు హాజరైన ఈ జంట.. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది.
తాము ఎలాంటి తప్పు చేయలేదని.. ఎవరి ఆస్తులకు నష్టం కలిగించలేదని, ఎవరికీ ప్రమాదం కలిగించాలనే ఉద్దేశం తమకు లేదని ఇవాన్ తెలిపారు. అంతేకాదు ప్రపంచానికి శాంతి, ప్రేమ సందేశాన్ని అందించేందుకే ఈ ప్రదర్శన చేసినట్లు ఏంజెలా పేర్కొన్నారు.
తొలుత చిన్నపాటి నేరాలకు సంబంధించిన అభియోగాలను అంగీకరించే ఒప్పందానికి ప్రాసిక్యూటర్లు అంగీకరించారని వారి న్యాయవాది నోమ్ బియాలే వెల్లడించారు. అయితే విచారణకు ముందు రోజు ఆ ఒప్పందాన్ని ఉపసంహరించుకున్నారని తెలిపారు. దీంతో ఈ జంటకు అమెరికా నుంచి బహిష్కరణ ముప్పు ఏర్పడింది.
ఒకవేళ రష్యాకు తిరిగి పంపిస్తే ఇవాన్‌ను ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడేందుకు పంపే అవకాశం ఉందని, ఏంజెలా తన కళాత్మక ప్రదర్శనల కారణంగా జైలు శిక్షను ఎదుర్కోవచ్చని న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. ఈ జంట సాహసాలు, ప్రేమకథ ఆధారంగా రూపొందిన 'స్కైవాకర్స్: ఎ లవ్ స్టోరీ' అనే డాక్యుమెంటరీ 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
ఇదీ చదవండి: మళ్లీ కొత్త కాన్వాయ్ కోసం వాహనాల కొనుగోలు


