అమెరికాలో ఒక్కసారిగా ఆగిన విమానాలు.. అసలేం జరిగింది? | Lakhs Stuck At US Airports After Flights Briefly Grounded | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఒక్కసారిగా ఆగిన విమానాలు.. అసలేం జరిగింది?

Nov 14 2026 9:37 AM | Updated on Nov 14 2026 9:54 AM

Lakhs Stuck At US Airports After Flights Briefly Grounded

అమెరికాలో గత రాత్రి ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎయిర్ ట్రాఫిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలో.. సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను కొద్దిసేపు నిలిపివేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.

కుటుంబ వేడుకలకు వెళ్లాల్సిన వారు, ఉద్యోగాల కోసం ప్రయాణించాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెప్టెంబర్ 11, 2001 ఉగ్రదాడుల తర్వాత.. అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను నిలిపివేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

కారణం ఇదే..
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA)కు సంబంధించిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్య ఏర్పడిందని, దీంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్తగా.. టేకాఫ్‌లను కొద్దిసేపు నిలిపివేయడం జరిగిందని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి మార్క్‌వేన్ ముల్లిన్ వెల్లడించారు.

అయితే.. ఎలాంటి భద్రతాపరమైన ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాత కొన్ని గంటల్లోనే ఆంక్షలను తొలగించి విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించారు. ఇది మరో 9/11 ఘటన కాదని ముల్లిన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ విమానాల రాకపోకలు సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రయాణికుల ఇబ్బందులు
ఈ ఘటనతో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నడీ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైలీ అలెక్సిస్ హోమ్స్ అనే మహిళ తన సోదరుడి సంగీత కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఒరెగాన్ వెళ్లాల్సి ఉంది. కానీ దాదాపు రెండు గంటలు ఎదురుచూసిన తర్వాత ఆమె విమానం రద్దయింది. దీంతో తన తల్లికి ఫోన్ చేసి ఏడ్చానని, ఎప్పుడు ప్రయాణం చేయగలనో తెలియక విమానాశ్రయంలోనే ఎదురుచూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

మరో ప్రయాణికుడు తన పనిమీద టొరంటో వెళ్లేందుకు టికెట్ కొనుగోలు చేసినప్పటికీ విమానాల నిలిపివేత కారణంగా ప్రయాణించలేకపోయాడు. ఇక మరో మహిళ తన కుమార్తె పెళ్లికి హాజరయ్యేందుకు టొరంటో వెళ్లాల్సి ఉండగా, విమానం రద్దవడంతో కన్నీళ్లు పెట్టుకుంది.

మరోవైపు అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ ఈ సమస్యకు గల కారణాన్ని వెల్లడించారు. అమెరికాలోని పాత టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు అధిక డేటా భారాన్ని తట్టుకోలేకపోవడంతో సమస్య ఏర్పడిందని తెలిపారు. పాత స్విచ్‌లు, రౌటర్లు అధిక సమాచారాన్ని ప్రాసెస్ చేయలేకపోవడంతో డేటా సరఫరాలో అస్థిరత ఏర్పడిందని వివరించారు. ఈ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించేందుకు కాంగ్రెస్ తగిన నిధులు కేటాయించాలని ఆయన కోరారు. తాత్కాలిక మరమ్మతులతో కాకుండా.. అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Microsoft Outage: 18 గంటల అంతరాయానికి కారణం ఏంటంటే?

ఎయిర్ ఇండియా అప్రమత్తం
ఈ పరిణామం భారత విమానయాన సంస్థలపైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఎయిర్ ఇండియా ప్రయాణికులను అప్రమత్తం చేసింది. అమెరికాకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాల్లో ఆలస్యాలు లేదా అంతరాయాలు ఉండవచ్చని తెలిపింది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించింది. అమెరికాలో థాంక్స్ గివింగ్ సెలవులు సమీపిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికుల్లో ఆందోళన మరింత పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement