దేశీయంగా పసిడి ధర వరుసగా నేలచూపులు చూసింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.2,500 తగ్గి రూ.1,40,900కు చేరుకుంది. నాలుగు రోజుల్లో రూ. 6,000 తగ్గడం గమనార్హం.
దీపావళి తర్వాత డిమాండ్ మందగించడం, అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం, డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడంతో పాటు గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పతనమవడంతో విలువైన లోహాలపై ఒత్తిడి నెలకొందని బులియన్ నిపుణులు తెలిపారు. మరోవైపు, గత ట్రేడింగ్ సెషన్‌లో నిలకడగా ఉన్న వెండి ధర సైతం తాజాగా దిగొచి్చంది. కిలో వెండి రూ.3,500 తగ్గి రూ.1,84,000 వద్ద స్థిరపడింది.
ఏడాది కనిష్టం నుంచి స్వల్ప రికవరీ
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఏడాది కనిష్టం (3,857 డాలర్లు) నుంచి తేరుకొని స్వల్పంగా రికవరీ బాటపట్టింది. స్పాట్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) బంగారం 14 డాలర్లు (0.35%) పెరిగి 3,899 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
‘‘టెహ్రాన్‌తో వాషింగ్టన్‌కు శాంతి ఒప్పందం అవసరం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో తక్షణ దౌత్యపరమైన పురోగతిపై ఆశలు సన్నగిల్లాయి. దీంతో పసిడికి ఏడాది కనిష్టం వద్ద కొనుగోళ్ల మద్దతు లభించినప్పటికీ.. సాంకేతికంగా కీలకమైన 4,000 డాలర్ల స్థాయిని మాత్రం ఛేదించలేకపోతోంది’’ అని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే, ఔన్సు వెండి ధర దాదాపు ఒక శాతం నష్టపోయి 49.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇదీ చదవండి: Microsoft Outage: 18 గంటల అంతరాయానికి కారణం ఏంటంటే?


