బంగారం ధరలు భారీగా తగ్గడంతో పండగ వేళ కొనుగోలుదారులు మళ్లీ ఆభరణాల దుకాణాల బాట పట్టారు. గతంలో 10 గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా రూ.1.80 లక్షలకు చేరగా.. ఇటీవల రూ.1.42 లక్షల స్థాయికి దిగివచ్చింది. అంటే సుమారు రూ.38 వేలు (21 శాతం) తగ్గింది. దీంతో ఈ ఏడాది ధంతేరాస్ (ధనత్రయోదశి), దీపావళి సందర్భంగా దేశంలో బంగారం కొనుగోళ్లు గతేడాదితో పోలిస్తే పరిమాణం పరంగా 30 శాతం పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) గణాంకాల ప్రకారం.. ఈ రెండు పండగల సమయంలో దేశవ్యాప్తంగా 52 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయి. వీటి విలువ సుమారు రూ.72 వేల కోట్లు. వెండి కొనుగోళ్లు కూడా 10 శాతం పెరిగి 300 టన్నులకు చేరాయి. వీటి విలువ దాదాపు రూ.5,400 కోట్లు.
సెప్టెంబర్ వరకు 50 శాతం తగ్గుదల
పండగల సమయంలో కొనుగోళ్లు పుంజుకున్నప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బంగారం విక్రయాలు గతేడాదితో పోలిస్తే పరిమాణం పరంగా దాదాపు 50 శాతం తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. భారీగా పెరిగిన ధరలు, దిగుమతి సుంకం పెంపు, బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇందుకు కారణాలుగా పేర్కొన్నాయి. ధరలు అందుబాటులో లేకపోవడంతో చాలామంది కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. తాజాగా ధరలు తగ్గడంతో ఆ డిమాండ్ కొంతమేర తిరిగి మార్కెట్లోకి వచ్చింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం కూడా కొనుగోళ్లకు ఊతమిచ్చింది. నవంబర్ మధ్య నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు వివాహాల సీజన్ కొనసాగనుంది.
వజ్రాల అమ్మకాల్లోనూ పండగ కళ
బంగారంతో పాటు సహజ వజ్రాల ఆభరణాల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయి. బెంగళూరుకు చెందిన సి. కృష్ణయ్య చెట్టి జ్యువెలర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ధంతేరాస్ సందర్భంగా సహజ వజ్రాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 250 శాతం పెరిగాయి. దీపావళి సమయంలోనూ 47 శాతం వృద్ధి నమోదైంది. ఆ సంస్థ గత ఎనిమిదేళ్ల విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే.. ఈసారి సహజ వజ్రాల అమ్మకాలు రెండో అత్యధిక స్థాయిలో ఉన్నాయి. మరోవైపు ప్రయోగశాలల్లో తయారుచేసే కృత్రిమ (ల్యాబ్ గ్రోన్) వజ్రాల మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఈ కింద చూడొచ్చు..
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


