సీఎం అవుతానని మీడియాకు ముందే తెలుసు: మోదీ | Speaking during the Deepawali Milan programme at the BJP HQ in Delhi | Sakshi
Sakshi News home page

సీఎం అవుతానని మీడియాకు ముందే తెలుసు: మోదీ

Nov 12 2026 12:34 PM | Updated on Nov 12 2026 12:43 PM

Speaking during the Deepawali Milan programme at the BJP HQ in Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన దీపావళి మిలన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో మీడియాతో సాగిన ప్రయాణంలోని ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు. తాను గుజరాత్‌ సీఎం అవుతానని మీడియా ముందుగానే గుర్తించిందన్నారు.

పండుగల సమయంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో గడపాలని కోరుకుంటారని మోదీ అన్నారు. నిరంతరం బ్రేకింగ్ న్యూస్ కోసం పరుగులు తీసే మీడియా ప్రతినిధులు తమ బిజీ షెడ్యూల్‌ను పక్కనపెట్టి ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇది బ్రేకింగ్ న్యూస్‌కు సంబంధించిన కార్యక్రమం కాకపోయినా, హాజరైనందుకు  ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

90వ దశకం నాటి అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. అప్పట్లో మీడియాకు ప్రెస్ రిలీజ్‌లు పంపించాలంటే ఫ్యాక్స్ మెషీన్ కోసం వెతకాల్సి వచ్చేదని చెప్పారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత కూడా తనకు ఇదే బాధ్యత ఉండేదన్నారు. అప్పట్లో జరిగే దీపావళి మిలన్ కార్యక్రమాల్లో కుర్చీలు వేయించడం నుంచి జర్నలిస్టులకు స్వాగతం పలకడం వరకు అన్ని పనులు తానే చూసుకునేవాడినని వెల్లడించారు.

ఆ రోజుల్లో కెమెరాలు తక్కువగా ఉన్నప్పటికీ జర్నలిస్టులతో తనకు మంచి పరిచయాలు ఉండేవని, కార్యక్రమాల్లో ఉత్సాహభరితమైన వాతావరణం ఉండేదని తెలిపారు. ఆ అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, అవి ఇప్పటికీ తనకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు.

రిపోర్టర్ ఎడిటర్‌గా మారినప్పుడు అతడి బాధ్యతలు ఎలా మారతాయో, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తన బాధ్యతలు కూడా అలాగే మారాయని మోదీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధిపతిగా తనకు 25 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు. ప్రెస్ రిలీజ్‌ల కాలం నుంచి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వరకు మీడియా రంగంలో వచ్చిన మార్పులను దగ్గరగా చూశానని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement