దాదర్(మహారాష్ట్ర): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ రైల్వే టికెట్ తనిఖీ సిబ్బంది (టీసీలు) చేపట్టిన ‘ఆపరేషన్ దీప్’ ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో జరిమానా వసూలైంది. నవంబరు 8న ఒక్కరోజే టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారి నుంచి ఏకంగా రూ.80.38 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఒక్కరోజే రూ.68.54 లక్షలు వసూలు చేసి నెలకొల్పిన రికార్డును తాజా వసూళ్లు అధిగమించాయి. గత రికార్డుతో పోలిస్తే మరో రూ.11.84 లక్షలు అధికంగా వసూలు కావడం విశేషం. దీపావళి, ఛాయ్ పూజా, ఛత్ పూజ తదితర పండుగల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ముంబై, పరిసర ప్రాంతాల లోకల్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది.
పండుగలకు స్వగ్రామాలకు వెళ్లేవారు, బంధువులు, స్నేహితులు ఇళ్లకు కుటుంబ సభ్యులతో బయలుదేరేవారు పెద్ద సంఖ్యలో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుండడంతో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు బయలుదేరే టెర్మినల్స్‌నకు, ఆయా రైళ్లు ఆగే స్టేషన్లకు చేరుకునేందుకు కూడా చాలామంది లోకల్ రైళ్లునే వినియోగిస్తున్నారు. దీంతో ప్రధాన స్టేషన్లతో పాటు చిన్న స్టేషన్లలోనూ టికెట్ కౌంటర్ల వద్ద పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. గంటల తరబడి క్యూల్లో నిలబడలేక కొందరు టికెట్లు తీసుకోకుండానే రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దీంతో అక్టోబరు 31 నుంచి నవంబరు 14 వరకు ‘ఆపరేషన్ దీప్’ పేరుతో ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పశ్చిమ రైల్వే పరిధిలోని పలు స్టేషన్లలో టీసీలు విస్త్రతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న పలువురు పట్టుబడటంతో భారీగా జరిమానాలు వసూలయ్యాయి.
గత ఏడాదితో పోలిస్తే 45.1 శాతం వృద్ధి
గత ఏడాది దీపావళి, ఛత్ పూజ పండుగల సందర్భంగా అక్టోబరు 19న ఒకేరోజు రూ.55.40 లక్షలు జరిమానా వసూలు చేశారు. ఈ ఏడాది నవంబరు 8న రూ.80.38 లక్షలు వసూలు కావడంతో గత ఏడాదితో పోలిస్తే జరిమానా ఆదాయం 45.1 శాతం పెరిగింది. అంతేకాకుండా ఆపరేషన్ దీప్‌లో భాగంగా వారం రోజుల్లో ముంబై సెంట్రల్ రీజియన్ పరిధిలో టీసీలు ఏకంగా రూ.3.28 కోట్ల జరిమానా వసూలు చేశారు.
అందుబాటులో ప్రత్యామ్నాయాలు ఉన్నా..
రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు (ఏటీవీఎం) ఏర్పాటు చేసింది. మొబైల్ పోర్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది. అయినప్పటికీ చాలామంది ప్రయాణికులు టికెట్ కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. క్యూ బెదదను తప్పించుకునేందుకు కొందరు టికెట్లు తీసుకుండానే ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే, అకస్మిక తనిఖీల్లో పట్టుబడి జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. ఇన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణికుల తీరు మారడం లేదని టికెట్ తనిఖీ సిబ్బంది పేర్కొంటున్నారు.
दीपावली और छठ पूजा के दौरान यात्रियों की बढ़ती भीड़ को देखते हुए पश्चिम रेलवे के उधना स्टेशन पर विशेष व्यवस्थाएं की गई हैं। इसके तहत वेटिंग एरिया में मौजूद यात्रियों को मोबाइल टिकटिंग के माध्यम से टिकट बुक करने में सहायता दी जा रही है, ताकि उन्हें टिकट के लिए लंबी कतारों में न लगना पड़े और उनकी यात्रा सुविधाजनक बन सके। @drmbct | @RailMinIndia #DiwaliSpecial #FestiveRush #CrowdManagement #DigitalTicketing #UdhnaStation
— Western Railway (@WesternRly) November 6, 2026


