చంగనాశేరి: కేరళలోని చంగనాశేరి ప్రాంతంలో విషాదం నెలకొంది. పెరున్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి దాదాపు ఐదు దశాబ్దాలుగా సేవలందించిన ఏనుగు శ్రీ వల్లీ గురువారం ఉదయం మృతి చెందింది. భక్తులు ఆప్యాయంగా ‘వల్లియమ్మ’ అని పిలుచుకునే ఆ ఏనుగు మరణవార్తతో ఆలయ భక్తులు, స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆలయానికి ఒక ఏనుగు దూరమవడమే కాదు.. తమతో దశాబ్దాల అనుబంధం కలిగిన ఓ ఆత్మీయ జీవిని కోల్పోయామన్న బాధ వారికి కలిగింది.
రూ.20 వేలతో ఆలయానికి చేరిన వల్లియమ్మ
1976 అక్టోబర్ 28న స్కంద షష్ఠి పర్వదినం సందర్భంగా శ్రీ వల్లీ ఆలయానికి చేరుకుంది. పుజవత్తులోని చిరయిల్ హౌస్‌కు చెందిన కమలాసనన్ అనే మురుగన్ భక్తుడు దానిని ఆలయానికి సమర్పించారు. కొన్నిలోని ఏనుగుల శిబిరంలో నిర్వహించిన వేలంలో అప్పట్లో రూ.20 వేలకు దానిని కొనుగోలు చేశారు. అలా ఆలయానికి వచ్చిన అది కాలక్రమంలో భక్తుల కుటుంబంలో సభ్యురాలిగా మారిపోయింది.
ఐదు దశాబ్దాలుగా చెక్కుచెదరని అనుబంధం
ఆలయ భక్తులు, స్థానికుల ప్రేమాభిమానాల మధ్య పెరిగిన శ్రీ వల్లీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. చిన్నప్పటి నుంచి దానిని ఆప్యాయంగా చూసుకున్న ప్రజలు ‘వల్లియమ్మ’గా పిలుచుకునేవారు. కాలం గడుస్తున్న కొద్దీ ఆలయంతో దానికున్న అనుబంధం మరింతగా పెరిగింది. ఆలయానికి వచ్చే భక్తులకు అది సుపరిచితమైన రూపంగా నిలిచిపోయింది.
ఆ గౌరవం మరే ఏనుగుకూ దక్కలేదు
పెరున్న ఆలయ వార్షిక ఉత్సవాల్లో ఎనిమిదో రోజు స్వామివారి తిడంబు (ఉత్సవ విగ్రహం)ను మోసే అరుదైన గౌరవం శ్రీ వల్లీకి మాత్రమే ఉండేది. ఊరేగింపులో ఎంతమంది మగ ఏనుగులు పాల్గొన్నా ఈ ప్రత్యేక బాధ్యతను మాత్రం దానికే అప్పగించేవారు. దశాబ్దాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆలయ ఉత్సవాల్లో అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘షణ్ముఖప్రియ గజరాణి’గా గౌరవం
కేరళలోని పలు ప్రముఖ ఆలయ ఉత్సవాల్లోనూ శ్రీ వల్లీ పాల్గొనేది. ఆలయానికి గర్వకారణంగా నిలిచిన దానిని దేవస్వం బోర్డు, స్థానికులు కలిసి ‘షణ్ముఖప్రియ గజరాణి’ అనే బిరుదుతో సత్కరించారు.
గురువారం ఉదయం అది తుదిశ్వాస విడవడంతో ఆలయ పరిసరాల్లో విషాదం నెలకొంది. భక్తులు, స్థానికులు నివాళులర్పించిన అనంతరం అటవీ శాఖ, దేవస్వం బోర్డు ఆదేశాల ప్రకారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
వల్లియమ్మ లేని లోటు తీరనిది..
1976లో ఆలయానికి వచ్చిన శ్రీ వల్లీ.. 2026 వరకు దాదాపు 50 ఏళ్ల పాటు భక్తుల జీవితాల్లో భాగమైంది. స్వామివారి ఉత్సవాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఐదు దశాబ్దాల అనుబంధం ఒక్కసారిగా ముగియడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు. ఇకపై ఆలయ ఉత్సవాల్లో వల్లియమ్మ కనిపించదు.. స్వామివారి తిడంబును మోసే ఆ పరిచయమైన రూపం భక్తులకు జ్ఞాపకంగానే మిగిలిపోనుంది.
ఇదీ చదవండి: కుట్లు వేశారు.. కాటన్ మరిచారు.. ఆరు నెలలు బాలింత విలవిల!


