న్యూఢిల్లీ: దీపావళి తర్వాత కూడా ఢిల్లీలో కాలుష్యం కష్టాలు తగ్గడం లేదు. తాజాగా ఛత్ పూజ వేళ జనం సొంతూళ్లకు బయలుదేరుతున్న సమయంలో నగరాన్ని విషపూరిత పొగమంచు కమ్మేసింది. గురువారం ఉదయం ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)321కి చేరింది. దీంతో గాలి నాణ్యత అత్యంత అధ్వాన్నమైన ‘వెరీ పూర్’ కేటగిరీలోకి పడిపోయింది. బుధవారం గాలి వేగం పెరగడంతో కొంత ఉపశమనం లభించినా.. ఒక్కరోజులోనే పరిస్థితి మళ్లీ దిగజారింది.
ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 317గా నమోదైంది. బుధవారం గాలి నాణ్యతను పరిశీలించిన 58 కేంద్రాల్లో 34 చోట్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండగా.. 22 కేంద్రాల్లో కాలుష్యం ‘పూర్’ స్థాయిలో నమోదైంది. ఒక కేంద్రంలో ఏక్యూఐ 400 దాటింది. ఢిల్లీ కాలుష్యానికి వాహనాల ఉద్గారాలు, పారిశ్రామిక వ్యర్థాలు, నిర్మాణ రంగంలోని దుమ్ముతో పాటు పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం కూడా కారణమవుతోంది. మంగళవారం ఆరు రాష్ట్రాల్లో 927 పంట వ్యర్థాల దహనం ఘటనలను ఉపగ్రహాలు గుర్తించాయి. ఢిల్లీ కాలుష్యంలో రవాణా రంగం వాటా 17 శాతంగా ఉండగా.. పంట వ్యర్థాల దహనం వాటా గురువారానికి 20 శాతానికి చేరవచ్చని అంచనా.
ఊపిరి తీసుకోవడమే కష్టమా?
ఏక్యూఐ 301-400 మధ్య ఉంటే అత్యంత అధ్వాన్నమైన స్థాయిగా పరిగణిస్తారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువసేపు బయట ఉండటం ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలున్నవారికి ముప్పు ఎక్కువ. చలిగాలులు, గాలి వేగం తగ్గడం వల్ల కాలుష్య కారకాలు వాతావరణంలోనే పేరుకుపోతున్నాయి. ఛత్ పూజ కోసం వేలాది మంది ప్రయాణాలు చేస్తున్న వేళ ఢిల్లీ వాయు కాలుష్యం మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ చదవండి: సోనియా పుస్తకం: ‘నువ్వు ఎవరితోనైనా తిరుగు..’ ఇందిర కండిషన్!


