భార్యపై నిరాధార ఆరోపణలు చేయడం తీవ్రమైన మానసిక క్రూరత్వమే
ఇది సమాజంలో పాతుకుపోయిన లింగ వివక్ష, పురుషాధిక్య భావజాలానికి నిదర్శనం
విడాకులు కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన జార్ఖండ్ హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: భార్య తన పురుష మిత్రుడితో ఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన ఆమెకు అక్రమ సంబంధం ఉందని ఆరోపించడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని జార్ఖండ్ హైకోర్టు తేల్చిచెప్పింది. ఓ మహిళ మరొక పురుషుడితో.. కనీసం స్నేహితుడిగా మాట్లాడినా వ్యభిచారం ఆరోపణలు చేయడం సమాజంలో పాతుకుపోయిన లింగ వివక్ష, పురుషాధిక్య భావజాలానికి నిదర్శనమని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విడాకులు కోరుతూ భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ సోనక్, జస్టిస్ మనోజ్ ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం నవంబర్ 3న తీర్పు వెలువరించింది.
కేసు నేపథ్యం.. కింది కోర్టు తీర్పు
2005లో వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యకు వైవాహిక జీవితంపై ఆసక్తి లేదని, ఓ గుర్తుతెలియని పురుషుడితో తరచుగా ఫోన్‌లో మాట్లాడుతోందని ఆరోపిస్తూ ఆమె భర్త 2021లో కుటుంబ న్యాయస్థానంలో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. తనతో గొడవలు పడుతూ మానసికంగా వేధిస్తూ 2015లోనే ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నాడు. మరోవైపు అదనపు కట్నం కోసం భర్త తనను అత్తింట్లో వేధించాడని భార్య కోర్టుకు తెలియజేసింది. తిరిగి కాపురం చేసుకునేందుకు అతను ఎలాంటి ప్రయత్నం చేయలేదని వాదించింది.
ఇరు పక్షాల వాదనలు విన్న కుటుంబ న్యాయస్థానం.. భర్త ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ 2023లో అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో విడాకుల కోసం భర్త హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు ధర్మాసనం.. కింది కోర్టు తీర్పుతో ఏకీభవించింది. భార్యపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో భర్త విఫలమయ్యాడని పేర్కొంది. ఆధారాలు లేకుండా కేవలం మూస పద్ధతిలో ఉన్న భావజాలంతో భార్యపై వ్యభిచారం ఆరోపణలు మోపడం ఆమెను మానసికంగా వేధించడమేనని స్పష్టంచేసింది. మరోవైపు ఆ దంపతుల 11 ఏళ్ల కుమార్తె ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. తండ్రి చెప్పిన మాటలనే తాను కోర్టులో చెబుతున్నట్లు ఆ చిన్నారి స్వయంగా అంగీకరించడమే ఇందుకు కారణం.
రాజీకి కనీస ప్రయత్నం శూన్యం
భార్య తనను మానసికంగా, శారీరకంగా హింసించిందని భర్త చేసిన ఆరోపణలకు ఎలాంటి నమ్మదగిన ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఏ అధికారిక సంస్థకూ అతడు ఫిర్యాదు చేయలేదని, రాజీ కోసం ఏ దశలోనూ ప్రయత్నం చేయలేదని గుర్తుచేసింది. భార్య తిరిగి కాపురానికి రావాలని కోరుకున్నప్పటికీ, భర్తే అంగీకరించలేదని నిర్ధారించింది. 2015లో నమోదైన క్రిమినల్ కేసును ముగించే ఉద్దేశంతోనే భార్యతో రాజీకి వచ్చినట్లు కనిపిస్తోందని, ఆ తర్వాత కలిసి జీవించాలన్న నిబంధనలను పాటించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం భర్త విడాకుల అప్పీల్‌ను జార్ఖండ్ హైకోర్టు కొట్టివేసింది.


