ఢిల్లీ ఎయిమ్స్‌లో కొనసాగుతున్న చికిత్స
న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(75) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. అపస్మారక స్థితికి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కార్డియో న్యూరో సెంటర్‌లో చేర్చి చికిత్స ప్రారంభించారు. ధన్‌ఖడ్ ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. ఎయిమ్స్ డాక్టర్లు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ధన్‌ఖడ్ 2022 ఆగస్టు నుంచి 2025 జూలై 21 దాకా ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పలుమార్లు స్పృహ తప్పి పడిపోయారు. 2025 మార్చి నెలలో ఛాతీ నొప్పి కారణంగా ఎయిమ్స్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్‌లో చేరారు. ఆయనకు యాంజియోప్లాస్టీ జరిగింది. ఉప రాష్ట్రపతిగా పదవి నుంచి తప్పుకున్న తర్వాత ప్రభుత్వం ఆయనకు అధికారిక భవనం కేటాయించలేదు. ప్రస్తుతం దక్షిణ ఢిల్లీలోని ఓ ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నారు. ఇది హరియాణా రాజకీయ నాయకుడు అభయ్ చౌతాలాకు చెందిన ఫామ్‌హౌస్.


