జ్వరం, జలుబు, దగ్గు, విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థినులు
వైఎస్సార్‌సీపీ నేత పుష్పశ్రీవాణి పాఠశాల సందర్శనతో బయటపడిన దారుణం
గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం శివన్నపేట గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 80 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, విరేచనాలతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని బయటకు తెలియనీయకుండా అక్కడి సిబ్బంది గురువారం 50 మంది విద్యార్థినులను కురుపాంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాకుండా మరో 10 కి.మీ దూరంలో ఉన్న మాదలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యం అందించారు. శుక్రవారం ఈ సమాచారం బయటకు పొక్కడంతో..పాఠశాల సిబ్బంది కేవలం నలుగురైదుగురు బాలికలే అస్వస్థతకు గురయ్యారని చూపే ప్రయత్నం చేశారు.
అయితే రెండు గదుల్లో అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఉంచి వైద్యసేవలు అందిస్తుండటాన్ని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి పాఠశాల సందర్శన సమయంలో గుర్తించారు. దీంతో చేసేదేమీలేక బాధిత విద్యార్థినులను వైద్యం కోసం కురుపాం సీహెచ్‌సీకి తరలించారు. పాఠశాలలో తాగునీరు కలుషితమవడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా, గతంలో పచ్చకామెర్లతో ఇదే పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు మృతి చెందారు.


