భారంగా విధులు.. విశ్రాంతి కరువు! | - | Sakshi
Sakshi News home page

భారంగా విధులు.. విశ్రాంతి కరువు!

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

ఇబ్బందికరంగా ఆదేశాలు

గత నెల 29వ తేదీ నుంచి మున్సిపల్‌ ఎన్నికల విధు లు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ విధుల్లో నిరంతరంగా పాల్గొంటున్నాం. సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహించి గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకు ముంచంగిపుట్టు చేరుకున్నాం. మళ్లీ శుక్రవారం ఉదయం కౌంటింగ్‌ శిక్షణకు హాజరై, కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండలాల్లో కౌంటింగ్‌ విధులు నిర్వహించాలని ఆదేశించడం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికే 100 నుంచి 180 కిలోమీటర్లు ప్రయాణించి విధులు నిర్వహించి వచ్చిన సిబ్బందిని తిరిగి అదే ప్రాంతాలకు పంపడం వల్ల తీవ్ర ప్రయాణ భారం పడుతోంది.

– ముక్కి రామకృష్ణ, ఉపాధ్యక్షులు, గిరిజన ఉద్యోగుల సంఘం, ముంచంగిపుట్టు

తీవ్ర అవస్థలు పడుతున్నాం

ఎన్నికల విధులకు సంబంధించిన ఆదేశాలను ముందుగానే తెలియజేస్తే సిబ్బంది ప్రయాణాలకు తగిన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు విధులకు హాజరుకావాలని చెప్పడంతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. కొయ్యూరు మండలంలో ఎన్నికల విధులకు వెళ్లి గత రెండు రోజులుగా సరైన నిద్ర, స్నానం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరవుతాం. అయితే ముందుగానే విధుల వివరాలు తెలియజేయడంతో పాటు, వీలైన మేర సమీప మండలాల్లో బాధ్యతలు కేటాయిస్తే ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయి. అధికారులు దీనిని పరిగణనలోకి తీసుకోవాలి.

– రెయ్యల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి,

మండల గిరిజన ఉద్యోగుల సంఘం, ముంచంగిపుట్టు

●

ఆర్వో శ్రీనివాసరావుకు సమస్య వివరిస్తున్న ఎన్నికల డ్యూటీ ఉపాధ్యాయులు

ఆవేదన వెలిబుచ్చుతున్న ఉపాధ్యాయులు

ముంచంగిపుట్టు: ఎన్నికల విధులంటేనే ఉపాధ్యాయులకు కత్తిమీద సాములా మారింది. మున్సిపల్‌ ఎన్నికల విధులు ముగియగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బాధ్యతలు.. అవి పూర్తిచేసుకుని అర్ధరాత్రి ఇళ్లకు చేరుకునేలోపే మళ్లీ కౌంటింగ్‌ విధులంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. కనీస విశ్రాంతి, నిద్రకు కూడా నోచుకోకుండా వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ విధులు నిర్వహించాల్సి రావడంతో ఉపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముంచంగిపుట్టు మండల కేంద్రంలో శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావుకు ఉపాధ్యాయుల నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది.

● గత నెల 29వ తేదీ నుంచి మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఆ వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ బాధ్యతలన్నీ ముగించుకుని గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకు ముంచంగిపుట్టు మండల కేంద్రానికి చేరుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం మళ్లీ కౌంటింగ్‌ శిక్షణకు రావాలని, అనంతరం కొయ్యూరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి, అనంతగిరి మండలాల్లో కౌంటింగ్‌ విధులకు హాజరుకావాలని ఆర్‌వో శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 70 మందికి పైగా ఉపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

● వంద నుంచి 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎన్నికల విధులు నిర్వహించిన తమను, మళ్లీ అదే దూరంలోని మండలాలకు కౌంటింగ్‌ కోసం పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ముంచంగిపుట్టులో శిక్షణ తీసుకుని, తిరిగి 3 గంటలకు కొయ్యూరులో కౌంటింగ్‌ విధులకు ఎలా హాజరుకావాలని నిలదీశారు. కొయ్యూరు, జి.కె.వీధి, చింతపల్లి మండలాల్లో పోలింగ్‌ విధులు నిర్వహించిన సిబ్బందికి ఆయా ప్రాంతాల్లోనే కౌంటింగ్‌ శిక్షణ ఇచ్చి విధులు కేటాయిస్తే ప్రయాణ భారం తగ్గుతుందని సూచించారు.

● కేవలం శిక్షణ కోసమే ముంచంగిపుట్టుకు వచ్చి, తిరిగి ఆయా మండలాలకు వెళ్లడం ఇబ్బందికరమని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన నిద్ర లేకుండా, రెండు మూడు రోజులుగా స్నానాలు చేసుకునే అవకాశం కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆర్‌వో దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, ఈ విషయంలో నిర్ణయం తమదేనని ఆర్‌వో బదులివ్వడంతో ఉపాధ్యాయులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

● చివరకు ఉపాధ్యాయుల విజ్ఞప్తితో స్పందించిన ఆర్‌వో ఉన్నతాధికారులతో మాట్లాడి రవాణా సదుపాయం కల్పించారు. కొయ్యూరు, అనంతగిరి వైపు వెళ్లేందుకు రెండు మార్గాల్లో రెండు బస్సులను ఏర్పాటు చేసి, కౌంటింగ్‌ విధులకు హాజరుకావాల్సిన సిబ్బందికి ఆదేశాలు అందజేశారు.

ఎన్నికల విధులతో

ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి!

పోలింగ్‌ నుంచి కౌంటింగ్‌ వరకు పరుగులే!

అర్ధరాత్రి వరకు విధులు

మళ్లీ కౌంటింగ్‌ శిక్షణకు పిలుపు

ఉపాధ్యాయుల సహనానికి పరీక్ష!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement