పోలింగ్‌ శాతాల్లో ఏదీ అసలు లెక్క? | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ శాతాల్లో ఏదీ అసలు లెక్క?

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

సాక్షి, పాడేరు: ఒకే ఎన్నిక.. ఒకే పోలింగ్‌.. కానీ అధికారికంగా వెలువడిన లెక్కలు మాత్రం మూడు రకాలు! జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ శాతంపై గంటల వ్యవధిలో వచ్చిన మార్పులు అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తున్నాయి. తొలుత 59.98 శాతంగా ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత 61.71 శాతంగా సవరించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్‌ నిశాంతి ఏకంగా 62.01 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు. దీంతో అసలు పోలింగ్‌ శాతం ఎంత? ఏ గణాంకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? అన్న ప్రశ్నలు పోటీలో ఉన్న అభ్యర్థులను వెంటాడుతున్నాయి.

617 కేంద్రాల్లో..

జిల్లాలో 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 617 పోలింగ్‌ కేంద్రాలకు గాను 44 సమస్యాత్మక కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్‌ ముగిసింది. మిగిలిన కేంద్రాల్లో నిర్ణీత సమయం సాయంత్రం 5 గంటలకు అధికారులు పోలింగ్‌ ప్రక్రియను ముగించారు. అయితే హుకుంపేట మండలం భీమవరం పోలింగ్‌ కేంద్రంలో మాత్రం సాయంత్రం 6.25 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగింది.

● పోలింగ్‌ ముగిసిన అనంతరం గురువారం రాత్రి 8 గంటల సమయంలో అధికారులు తొలుత 59.98 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ప్రకటించారు. డుంబ్రిగుడలో అత్యధికంగా, గూడెంకొత్తవీధిలో అత్యల్పంగా ఓటింగ్‌ జరిగినట్లు వెల్లడించారు. దీంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈ గణాంకాలనే తుది లెక్కలుగా భావించారు. అయితే రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఫైనల్‌ రిపోర్టు పేరుతో 61.71 శాతం పోలింగ్‌ నమోదైనట్లు మరో ప్రకటన వెలువడింది. గంటల వ్యవధిలోనే పోలింగ్‌ శాతం పెరగడం చర్చనీయాంశమైంది.

● అయితే రాత్రి వేళలో ఏ పోలింగ్‌ కేంద్రంలోనూ ఓటింగ్‌ జరగలేదని ఎన్నికల అధికారి, డీఆర్‌డీఏ పీడీ జయకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. మరి పోలింగ్‌ శాతం ఎలా పెరిగింది? మొదట ప్రకటించిన గణాంకాల్లో ఏమైనా ఓట్లు లెక్కలోకి రాలేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్‌ నిశాంతి మీడియా సమావేశంలో 62.01 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ప్రకటించడంతో గందరగోళం మరింత పెరిగింది.

కలెక్టర్‌ ప్రకటించిన లెక్కలివీ..

జిల్లాలోని 617 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 4,98,465 మంది ఓటర్లకు గాను 3,09,133 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్‌ తెలిపారు. వీరిలో పురుషులు 1,54,382 మంది, మహిళలు 1,54,748 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారని వెల్లడించారు. మండలాల వారీగా డుంబ్రిగుడలో 73.63 శాతంతో అత్యధికంగా, చింతపల్లిలో 52.25 శాతంతో అత్యల్పంగా పోలింగ్‌ నమోదైనట్లు పేర్కొన్నారు. అనంతగిరి 65.34, అరకులోయ 68.34, జి.మాడుగుల 58.36, జి.కే.వీధి 53.28, హుకుంపేట 68.32, కొయ్యూరు 61.50, ముంచంగిపుట్టు 63.76, పాడేరు 65.29, పెదబయలు 60.48 శాతం పోలింగ్‌ జరిగినట్లు వివరించారు.

రాత్రి 8 గంటల నివేదికలో 59.98 శాతం

జిల్లాలో 4,98,465 మంది ఓటర్లకు గాను 2,99,001 మంది ఓటు వేసినట్లు గురువారం రాత్రి 8 గంటలకు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో 59.98 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు. మండలాల వారీగా డుంబ్రిగుడలో 70.83 శాతంతో అత్యధికంగా, జి.కే.వీధిలో 34.77 శాతంతో అత్యల్పంగా నమోదైనట్లు పేర్కొన్నారు. అనంతగిరి 65.38, అరకులోయ 68.45, చింతపల్లి 54.24, జి.మాడుగుల 58.79, హుకుంపేట 68.09, కొయ్యూరు 60.27, ముంచంగిపుట్టు 63.47, పాడేరు 64.95, పెదబయలు 60.48 శాతం పోలింగ్‌ జరిగినట్లు ఆ నివేదికలో వివరించారు.

తుది రిపోర్టులో 61.71 శాతం : గురువారం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎన్నికల విభాగం అధికారులు ఫైనల్‌ రిపోర్టు పేరుతో మరో గణాంకాన్ని విడుదల చేశారు. జిల్లాలో 4,98,465 మంది ఓటర్లకు గాను 3,07,589 మంది ఓటు వేసినట్లు, మొత్తం 61.71 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ప్రకటించారు. ఈ నివేదికలో డుంబ్రిగుడలో 70.83 శాతంతో అత్యధికంగా, చింతపల్లిలో 52.25 శాతంతో అత్యల్పంగా పోలింగ్‌ జరిగినట్లు పేర్కొన్నారు. అనంతగిరి 65.38, అరకులోయ 68.45, జి.కే.వీధి 53.53, జి.మాడుగుల 58.79, హుకుంపేట 68.09, కొయ్యూరు 60.25, ముంచంగిపుట్టు 63.64, పాడేరు 64.9, పెదబయలు 60.48 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు.

గంటల వ్యవధిలో మారిన గణాంకాలు

తొలుత 59.98 నుంచి 61.71..

అక్కడి నుంచి 62.01 శాతానికిపెరుగుదల

ఓట్ల లెక్కల్లో తేడాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ

ఒకే ఎన్నిక.. మూడు రకాల పోలింగ్‌ శాతాలు!

వ్యత్యాసానికి కారణాలేంటి?

మూడు ప్రకటనల్లోనూ పోలింగ్‌ శాతం, ఓట్ల సంఖ్య, కొన్ని మండలాల గణాంకాల్లో తేడాలు కనిపిస్తుండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తొలి నివేదిక, ఫైనల్‌ రిపోర్టు, కలెక్టర్‌ ప్రకటించిన గణాంకాల మధ్య వ్యత్యాసానికి కారణాలేమిటో అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. తుది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న ఈ లెక్కలపై సందేహాలు తొలగాలంటే సమగ్ర వివరణ అవసరమని అభ్యర్థులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement