● జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాలు
● 298 టేబుళ్ల ఏర్పాట్లు
● 1200 మంది సిబ్బందితో నిర్వహణ
సాక్షి, పాడేరు: స్థానిక సంస్థల ఎన్నికల సమరం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం తేలే సమయం ఆసన్నమైంది. శనివారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లలోనూ నెలకొంది. స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు తెరుచుకోనుండటంతో అందరి దృష్టి కౌంటింగ్ కేంద్రాలపై పడింది.
● జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 11 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు 148, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు మరో 148 టేబుళ్లను సిద్ధం చేశారు. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వహించనున్నారు. మొత్తం 1,200 మంది సిబ్బందిని కౌంటింగ్ విధులకు నియమించారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్లు..
కౌంటింగ్ ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎంపీటీసీ స్థానాల ఫలితాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఫలితాలను ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారని కలెక్టర్ నిశాంతి తెలిపారు.
మీడియా కేంద్రాల ఏర్పాటు
అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేశారు. కలెక్టరేట్‌లోని ఎంసీఎంసీ ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రత్యక్షంగా ప్రదర్శించేందుకు చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.


