తప్పు చేసి.. తప్పుడు కేసు | Non bailable cases registered against senior YSRCP leader Lella Appi Reddy | Sakshi
Sakshi News home page

తప్పు చేసి.. తప్పుడు కేసు

Nov 7 2026 4:23 AM | Updated on Nov 7 2026 4:23 AM

Non bailable cases registered against senior YSRCP leader Lella Appi Reddy

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని గుంటూరు జిల్లా కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

బ్యాలెట్‌ బాక్స్‌ మార్చబోయి అర్ధరాత్రి అడ్డంగా దొరికిపోయిన అధికారులు  

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 

ధర్నా సాక్షిగా తప్పు ఒప్పుకున్న పోలింగ్‌ అధికారి

జెడ్పీ సీఈవో వచ్చి వివరణ ఇస్తుండగానే లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు 

గంట తర్వాత ధర్నా వద్దకు చేరుకున్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి 

ఈ ఘటన మొత్తం వీడియోల్లో రికార్డు 

అయినా, అప్పిరెడ్డే బ్యాలెట్‌ బాక్సు లాక్కోబోయారంటూ తప్పుడు కేసు 

ఆయనపైన, మరికొందరి పైనా నాన్‌ బెయిలబుల్‌ కేసు 

బ్యాలెట్‌ బాక్సు దించడం దురదృష్టకరమని కలెక్టర్, ఎస్పీ వెల్లడి 

వీరి స్టేట్‌మెంట్‌లకు విరుద్ధంగా ఎస్సై చేత తప్పుడు ఫిర్యాదు.. ఎస్సై ఎస్కార్ట్‌ డ్యూటీలో ఉన్నారంటున్న అధికారులు 

ఎస్సై ఆ బస్సు దరిదాపుల్లో లేరని చెప్తున్న స్థానికులు 

పీఓ బ్యాలెట్‌ బాక్సుతో మరో బస్సు ఎక్కడానికి అక్కడ దిగారని ఫిర్యాదులో వెల్లడి 

కానీ, ఆ సమయంలో మరో బస్సు ఎక్కడా లేదని స్థానికుల స్పష్టీకరణ

శుక్రవారం రాత్రి అప్పిరెడ్డిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు.. రిమాండ్‌ విధింపు  

సాక్షి ప్రతినిధి, గుంటూరు: విపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకొని, దాడులు చేసిన వారిపై కేసుల్లేవు.. నామినేషన్‌ పత్రాలను అభ్యర్థులు, అధికారుల చేతుల్లోంచి బహిరంగంగానే లాక్కొని చించేసిన వారిపై కేసుల్లేవు.. నామినేషన్‌ వేసిన అభ్యర్థులకు తెలియకుండా, ఫోర్జరీ సంతకాలు చేసి వారి నామినేషన్లను ఉపసంహరింపజేసిన వారిపై కేసుల్లేవు.. పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించిన వారిపై కేసుల్లేవు.. దొంగ ఓట్లు వేయించిన వారు, రిగ్గింగ్‌ చేసిన వారిపై కేసుల్లేవు.. కానీ, పోలింగ్‌ కేంద్రం నుంచి కౌంటింగ్‌ కేంద్రానికి తరలిస్తుండగా బ్యాలెట్‌ బాక్సును అక్రమంగా మార్చేయాలన్న దుశ్చర్యను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతపై మాత్రం అక్రమ, తప్పుడు కేసులు పెట్టారు. అదీ నాన్‌బెయిలబుల్‌ కేసు. 

ఇదీ చంద్రబాబు విరచిత రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో ఎన్నికల తీరు. బ్యాలెట్‌ బాక్సును మార్చబోయి అడ్డంగా దొరికిపోయిన అధికారులు, గుంటూరు జిల్లా పోలీసులు వారి తప్పును కప్పిపుచ్చుకొనేందుకు మరికొన్ని తప్పులు చేసి, చివరకు వారి అప్రజాస్వామిక దుశ్చర్యను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. అది కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, పార్టీ నాయకులు ఆ అధికారిని నిలదీసి, అక్కడే రోడ్డుపై ధర్నా చేయడంతో ఉన్నతాధికారులు రంగప్రవేశం చేసి, పరిస్థితిని చక్కదిద్దారు. అయినా శాంతియుతంగా ధర్నా చేసిన వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. 

పైగా, విషయం తెలుసుకొని ధర్నా ప్రారంభమైన గంట తర్వాత అక్కడికి వచ్చిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పైనా కేసు పెట్టడం పోలీసుల దుర్మార్గానికి మరో నిదర్శనం. ఇంకా విచిత్రమేమిటంటే.. అసలు ఘటన స్థలంలోనే లేని ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ తప్పుడు కేసు పెట్టడం. ఇదంతా చంద్రబాబు మార్కు రెడ్‌బుక్‌ రాజ్యాంగం మేరకే జరిగిందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 

అర్ధరాత్రి బ్యాలెట్‌ బాక్సు మార్చడానికి ప్రయత్నించి.. 
గురువారం పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ కేంద్రాలకు బస్సుల్లో తరలించారు. వాస్తవానికి ఈ బస్సులకు పోలీసు రక్షణ ఉంటుంది. అయితే, గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెం–1 పోలింగ్‌ బూత్‌ నుంచి బ్యాలెట్‌ బాక్సులను నాగార్జున యూనివర్సిటీకి తరలిస్తున్న బస్సుకు పోలీసు భద్రత కల్పించలేదు. ఈ బస్సును మధ్యలోనే ఆపేశారు. దానిలో నుంచి ఓ పోలింగ్‌ అధికారి 1503–5–1 నంబరు బ్యాలెట్‌ బాక్సుతో కిందకు దిగి, రోడ్డు పక్కన నిలబడ్డారు. బస్సు వెనుకే వస్తున్న ఎంపీటీసీ అభ్యర్థిని ఇందిర, స్థానికులు దీనిని గమనించారు. వెంటనే అధికారిని రోడ్డుపైనే నిలదీశారు. 

బ్యాలెట్‌ బాక్సును మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అక్కడే నిలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. బాక్సుతో సహా దానిని దించిన అధికారిని అక్కడే కూర్చోబెట్టి, ఈ దుశ్చర్యకు కలెక్టర్‌ సమాధానం చెప్పాలంటూ శాంతియుతంగా రోడ్డుపైనే బైఠాయించారు. అనంతరం అక్కడికి వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా చేరుకొని, ధర్నాలో పాల్గొన్నారు. ఓ అధికారి నిబంధనలకు విరుద్ధంగా బస్సులో నుంచి బ్యాలెట్‌ బాక్స్‌ను కిందకు దించి భుజంపై మోసుకుంటూ రోడ్డుపై నిలబడడం, ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడకు వచ్చిన సీఐ కూడా ఆయన పక్కనే నిలబడ్డారు. ఇదంతా వీడియోల్లో కూడా స్పష్టంగా రికార్డయింది. 

గురువారం రాత్రి బ్యాలెట్‌ బాక్సు తరలింపును అడ్డుకుని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు 

ఈ విషయం తెలిసి జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, జిల్లా పరిషత్‌ సీఈఓ వి.జ్యోతిబసును అక్కడకు పంపారు. ధర్నా చేస్తున్న వారితో జ్యోతిబసు మాట్లాడారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆ అధికారి చెబుతుండగానే, అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రశాంతంగా ధర్నా చేస్తున్న వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకుని గురువారం అర్ధరాత్రి నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. తొలుత ధర్నా కేసు పెట్టి పంపుతామని చెప్పిన అధికారులు.. ఆ తర్వాత కక్షపూరితంగా నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు నమోదు చేశారు. 

బ్యాలెట్‌ బాక్సును మార్చేయడానికి యత్నించిన దుశ్చర్యపై పూర్తి విచారణ జరిపి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా ఉన్నతాధికారులు, ఎస్‌ఈసీ.. ఆ తప్పును కప్పిపుచ్చేందుకు శాంతియుతంగా ధర్నా చేసిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు పరిశీలకుడు గులాం రసూల్‌తోపాటు, మరో 17 మందిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ కింద అక్రమ  కేసు నమోదు చేసి అరెస్టు చేయడం పోలీసులు ఏ స్థాయిలో అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారో తేటతెల్లం చేస్తోంది.  

తప్పు ఒప్పుకొన్న అధికారులు.. అయినా వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసు 
ఘటన జరిగిన తరువాత గురువారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మీడియా సమావేశం ఏర్పాటుచేసి చల్లావారిపాలెం వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరమని, ఆఫీసర్‌ ఒక బస్సు దిగి, వేరే బస్సు ఎక్కే క్రమంలో అభ్యర్థితోపాటు, స్థానికులు బ్యాలెట్‌ బాక్సు మారుస్తున్నారనే అపోహతో అతన్ని పట్టుకుని, రోడ్డుపై బైఠాయించారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గంటన్నర ధర్నా తరువాత పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టి బ్యాలెట్‌ బాక్సును బస్సులో పంపించారని చెప్పారు. 

వారి మాటల్లో ఎక్కడా స్థానికులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బ్యాలెట్స్‌ బాక్సును లాక్కెళ్లడానికి యత్నించారనే మాట లేదు. అదేవిధంగా ధర్నా సమయంలో పీఓ మధుసూదనరెడ్డి సైతం తాను బస్సు దిగి, బ్యాలెట్‌ బాక్సు పట్టుకుని రోడ్డుపై నిలబడడం తప్పేనని, ఆ సమయంలో మరో బస్సు వెనుక లేదని స్పష్టంగా చెప్పాడు. బ్యాలెట్‌ బాక్సును మార్చేయడానికి అధికారులు ప్రయత్నించారన్న వాస్తవానికి ఈ అధికారుల స్టేట్‌మెంట్లే పక్కా నిదర్శనం. అయితే, చంద్రబాబు రెడ్‌బుక్‌ దీనిని అంగీకరించలేదు. దీంతో శుక్రవారం తెల్లవారేసరికి పోలీసులు కథను పూర్తిగా మార్చేశారు. అధికారులు, పోలీసులు ఇరుక్కుంటారనే భయంతో వైఎస్సార్‌సీపీ నేతలపైనే తప్పుడు కేసు పెట్టించారు. 

ఎస్‌ఐ నాగేంద్ర పేరుతో ఒక ఫిర్యాదును ఇప్పించారు. అందులో మధుసూదన్‌రెడ్డి అనే పీఓ బ్యాలెట్‌ బాక్సు తీసుకుని బస్సు దిగి, చల్లావారిపాలెం బస్సు ఎక్కుతుండగా, అక్కడ ఉన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డితోపాటు, మరో 18 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, 200 మంది కార్యకర్తలు ఆ పోలింగ్‌ అధికారిని చేతులతో కొట్టి, కాళ్లతో తన్ని అతని వద్ద నుంచి బలవంతంగా బ్యాలెట్‌ బాక్సును లాక్కుంటుండగా, ఎస్సై నాగేంద్ర తన సిబ్బందితో వెళ్లి అడ్డుకున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు పోలీసులను అడ్డుకుని, చంపుతామని బెదిరించినట్లుగా ఫిర్యాదు చేయించారు. 

విచిత్రమేమిటంటే.. ఈ ఫిర్యాదు ఇచ్చిన ఎస్సై నాగేంద్ర బస్సుతో పాటు ఎస్కార్టులో వచ్చారని అధికారులు చెబుతుండగా, అసలు బస్సుకు ఎస్కార్టే లేదని, ఆ ఎస్సై అక్కడికి దరిదాపుల్లోనే లేరని స్థానికులు చెబుతున్నారు. మరో విషయమేంటంటే.. ఆ పీఓ మరో బస్సు ఎక్కడానికి దిగారని ఫిర్యాదులో చెప్పగా.. ఆ సమయంలో దరిదాపుల్లో మరో బస్సు లేదని స్థానికులు చెప్పడం. దీన్నిబట్టి ఈ తప్పుడు ఫిర్యాదు వెనుక అధికార‡ పార్టీ నేతలు, కొందరు ఉన్నతాధికారుల ప్రమేయం… స్పష్టంగా కనిపిస్తుంది.… 

పీఓతోపాటు బ్యాలెట్‌ బాక్సును రోడ్డుపై పెట్టి గంటకుపైగా ధర్నా చేసిన తరువాత విషయం తెలుసుకుని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్కడకు చేరుకున్నారు. అయినప్పటికీ ఫిర్యాదులో మాత్రం పీఓ బస్సు దిగే సమయంలో అప్పిరెడ్డి తన అనుచరులతో బ్యాలెట్స్‌ బాక్సును లాక్కునేందుకు యత్నించారనడం చూస్తుంటే అధికారులు ఏ స్థాయికి దిగజారారో అర్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కూటమి అక్రమాలు, అరాచకాలపై ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పలుమార్లు ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేయడం, కోర్టుకు వెళ్లడం వంటి చర్యలను తట్టుకోలేకనే తప్పుడు కేసులో ఇరికించారనేది స్పష్టంగా అర్థమవుతోంది.  

19 వరకు అప్పిరెడ్డికి రిమాండ్‌ 
లక్ష్మీపురం (గుంటూరు): తప్పుడు కేసులో గురువారం అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసిన లేళ్ల అప్పిరెడ్డిని శుక్రవారం సాయంత్రం వరకు నల్లపాడు పోలీసు స్టేషన్‌లో ఉంచారు. సాయంత్రం 5 గంటల తరువాత గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం గుంటూరు జిల్లా 1వ అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఎం.జగదీశ్వరి రాత్రి 7 గంటలకు వాదనలు వినిపించాలని సమయాన్ని కేటాయించారు. అప్పిరెడ్డి తరఫున వైఎస్సార్‌సీపీ నేత, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు సుమారు 3 గంటలపాటు వాదనలు వినిపించారు. 

ప్రభుత్వం తరపున పీపీ రామకోటేశ్వరరావు వాదించారు. వాదనల అనంతరం అప్పిరెడ్డికి న్యాయమూర్తి ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం ఆయన్ని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే అప్పిరెడ్డిపై అక్రమ కేసు పెట్టి జిల్లా కోర్టులో హాజరు పరిచారన్న విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు, సోదరి వీరమ్మ కోర్టు వద్దకు వచ్చారు. న్యాయమూర్తి రిమాండ్‌ విధించారన్న విషయం తెలుసుకున్న అప్పిరెడ్డి సోదరి, కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అప్పిరెడ్డికి సంఘీభావం తెలుపుతూ వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున కోర్టు వద్దకు వచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement