ఉదయం 8 గంటలకు ప్రారంభం
365 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు
7,767 ఎంపీటీసీ, 582 జెడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
పోటీలో మొత్తం 21,012 మంది అభ్యర్థులు
ఏకకాలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు
ప్రతి కౌంటింగ్ కేంద్రంలో రెండింటికీ బల్లలు కేటాయించినట్లు ఎస్‌ఈసీ వెల్లడి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. ఏకగ్రీవాల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 7,767 ఎంపీటీసీ స్థానాలు, 582 జెడ్పీటీసీ స్థానాలకు గురువారం, రీపోలింగ్ జరిగిన చోట్ల శుక్రవారాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 21,012 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ ఓట్ల లెక్కింపు కోసం 365 కేంద్రాల్లో సుమారు 9,062 బల్లలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) తెలిపింది. ఓట్ల లెక్కింపులో 11,002 మంది సూపర్‌వైజర్లు, 28,692 మంది సిబ్బంది పాల్గొంటారని పేర్కొంది.
తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారని, ఆ తర్వాత బ్యాలెట్ పెట్టెల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను ఏకకాలంలో లెక్కిస్తారని తెలిపింది. ఇందుకోసం కౌంటింగ్ కేంద్రంలోని టేబుల్స్‌లో సగం ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, మిగిలిన సగం జెడ్పీటీసీకి కేటాయించినట్లు చెప్పింది. ప్రతి బల్లకు ఒక్కో రౌండ్‌లో 1,000 బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో పటిష్టమైన పోలీసు భద్రత, సీసీ టీవీ నిఘా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.
మొత్తం 70.02 శాతం పోలింగ్ నమోదు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తంగా 70.72 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. 2021 ఎన్నికల పోలింగ్ శాతం 60.91తో పోలిస్తే 9.81 శాతం ఎక్కువగా ఓటింగ్ జరిగినట్టు తెలిపింది.
కౌంటింగ్‌కు భారీ పోలీసు బందోబస్తు: ఐజీ రాజకుమారి
ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐజీ బి. రాజకుమారి చెప్పారు. మొత్తం 365 కౌంటింగ్ కేంద్రాల వద్ద 19,885 మంది పోలీసు సిబ్బందితో మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్ సర్వైలెన్స్‌తో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీ వోర్న్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు.


