పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ఈవినింగ్‌ కోర్టులు  | Union government is set to establish evening courts as a pilot project | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ఈవినింగ్‌ కోర్టులు 

Nov 12 2026 5:38 AM | Updated on Nov 12 2026 5:38 AM

Union government is set to establish evening courts as a pilot project

ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బిహార్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు  

అదనపు వేళల్లో విశ్రాంత న్యాయమూర్తులతో విచారణలు 

ప్రస్తుత జడ్జీలపై భారం పడకుండా జాగ్రత్తలు 

పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమల్లోకి..  

ఏకంగా 5.64 కోట్లకుపైగా పెండింగ్‌ కేసులు  

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో భారీగా పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గించి, సత్వర న్యాయం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు తొలివిడతగా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బిహార్‌ రాష్ట్రాల్లో ’ఈవినింగ్‌ కోర్టులు’         (సాయంత్రం వేళల్లో పనిచేసే న్యాయస్థానాలు) ప్రారంభించాలని నిర్ణయించింది. కేంద్ర న్యాయ, శాసన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ఓ ఆంగ్ల దినపత్రికకు      ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ నూతన ప్రణాళికను వెల్లడించారు. రాష్ట్రాల హైకోర్టుల సమన్వయంతో త్వరలోనే ఈ పైలట్‌ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.  

విశ్రాంత న్యాయమూర్తులతో విచారణ  
ప్రస్తుతం పగటిపూట నిరీ్ణత వేళల్లో పనిచేస్తున్న కోర్టులు, ఆ సమయం ముగిసిన తర్వాత సాయంత్రం వేళల్లో అదనంగా కొన్ని గంటల పాటు ఈవినింగ్‌ కోర్టులుగా పనిచేస్తాయి. అయితే, ప్రస్తుతం విధుల్లో ఉన్న న్యాయమూర్తులపై అదనపు భారం పడకుండా, ఈ కేసులను విచారించేందుకు విశ్రాంత(రిటైర్డ్‌) న్యాయమూర్తులను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈవినింగ్‌ కోర్టుల్లో ప్రత్యేకంగా దీర్ఘకాలిక పెండింగ్‌ కేసులనే విచారించి పరిష్కరిస్తారు. ఎంపిక చేసిన మూడు రాష్ట్రాలు ఏపీ, ఢిల్లీ, బిహార్‌ పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. ఈవినింగ్‌ కోర్టుల పనితీరు, కేసుల పరిష్కార రేటును కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీని ఆధారంగా భవిష్యత్తులో ఈ విధానాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సైతం విస్తరించనున్నారు.  

ఆందోళన పెంచుతున్న పెండింగ్‌ కేసులు  
కోర్టుల్లో కేసుల పెండింగ్‌ అనేది దశాబ్దాలుగా తీవ్ర సమస్యగా మారింది. న్యాయశాఖ తాజా గణాంకాలను పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు, 25 హైకోర్టులు, జిల్లా, కింది స్థాయి కోర్టుల్లో ఏకంగా 5.64 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం సుప్రీంకోర్టులోనే 96 వేలకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోలేదు. వీటిలో 10 వేల కేసులు దశాబ్ద కాలంగా, 26 కేసులు ఏకంగా 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. హైకోర్టుల్లో 80 వేలకు పైగా కేసులు మూడు దశాబ్దాలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా కేసులను త్వరగా పరిష్కరించడానికే ఈవినింగ్‌ కోర్టుల విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

ప్రత్యామ్నాయ వేదికల బలోపేతం  
కోర్టులపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు కేవలం ఈవినింగ్‌ కోర్టులపైనే కాకుండా, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికల(ఏడీఆర్‌) పైనా కేంద్రం దృష్టి సారించినట్లు మంత్రి మే ఘ్వాల్‌ తెలిపారు. లోక్‌ అదాలత్‌లను మరింత బలోపేతం చేయడం ద్వారా కేసులను కోర్టు వెలుపలే రాజీ మార్గంలో పరిష్కరించుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సుదీర్ఘ న్యాయపోరాటాలకు వెళ్లకుండా మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం చేయకుండా దేశమంతటా అమలు చేయాలన్నదే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement