న్యూఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన భీకర కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన తర్వాత అప్రమత్తమైన భారతీయ భద్రతా బలగాలు, నిఘా సంస్థలు దేశంలో ఉగ్రవాద మూలాలను ఏరివేయడానికి భారీ స్థాయిలో ఉక్కుపాదం మోపాయి.
ఈ ఉగ్రవాద వ్యతిరేక దండయాత్రలో భాగంగా గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 300 మందికి పైగా ఉగ్రమూకలను, అనుమానితులను అరెస్ట్ చేసినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా, విదేశాల్లో తలదాచుకున్న దాదాపు 73 మంది కీలక ఉగ్రవాద భరతం పట్టి, వారిని భారత్‌కు రప్పించడంలో కేంద్ర నిఘా వర్గాలు విజయవంతమయ్యాయి.
గతంలో ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో అత్యంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన ఉగ్రవాద మాడ్యూల్స్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రాష్ట్ర పోలీసుల సంయుక్త బలగాలు ఛేదించాయి. ఈ కుట్ర వెనుక వైట్ కాలర్ నిపుణులు, వైద్యుల ప్రమేయం ఉండటం అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఉదంతం తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశీయ భద్రతా యంత్రాంగాన్ని మరింత కట్టుదిట్టం చేసింది.
దేశంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను సమూలంగా అణచివేయడానికి ప్రభుత్వం 'ప్రహార్' పేరిట సరికొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా కేవలం దాడులను అడ్డుకోవడమే కాకుండా, ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్న నెట్‌వర్క్‌లు, రిక్రూట్‌మెంట్ మాడ్యూల్స్, సరిహద్దులు దాటి కుట్రలు పన్నుతున్న ఉగ్రసంస్థల మద్దతుదారులపై కేంద్రం ఏకకాలంలో దాడులు నిర్వహించింది.
ముఖ్యంగా జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయిబా , అల్-ఖైదా అనుబంధ సంస్థలు అలాగే విదేశాల నుంచి భారత్‌ను అస్థిరపరచాలని చూస్తున్న వివిధ ఉగ్రమూకల కదలికలపై నిఘా పెంచారు. విదేశాల్లో తలదాచుకుని భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంతో పాటు, ఇటీవల ప్రత్యేక అన్వేషణ, రప్పించే పోర్టళ్లను కూడా అందుబాటులోకి తెచ్చారు.
దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, ఉగ్రవాద జాడ ఎక్కడ కనిపించినా కఠినంగా అణచివేస్తామని భద్రతా బలగాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమగ్ర దండయాత్రతో దేశంలో ఉగ్రవాద సానుభూతిపరుల నెట్‌వర్క్‌లకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు.


