ప్రభుత్వంలో భారీ సైబర్‌ మోసం.. సీఎం విజయ్‌పై విమర్శల వెల్లువ | BJP targets Tamil Nadu government over rs22crore bank fraud | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంలో భారీ సైబర్‌ మోసం.. సీఎం విజయ్‌పై విమర్శల వెల్లువ

Nov 11 2026 2:28 AM | Updated on Nov 11 2026 2:28 AM

BJP targets Tamil Nadu government over rs22crore bank fraud

సాక్షి,చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన భారీ సైబర్ మోసం రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రభుత్వ ఖాతాల నుంచి కోట్లాది రూపాయలు అపహరణకు గురికావడంపై రాష్ట్రంలోని అధికారిక పాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ అంశంపై బీజేపీ  సీఎం విజయ్‌ను ప్రశ్నిస్తూ టార్గెట్ చేసింది. ప్రజలు సమాధానం కోరుకుంటున్న సమయంలో సీఎం విజయ్ ఎక్కడ ఉన్నారు? అంటూ బీజేపీ నేతలు నిలదీశారు.  
తమిళనాడు ప్రభుత్వానికి చెందిన వివిధ బ్యాంక్ ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ. 22.10 కోట్లను కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. రామకథాపురం, నాగపటినం, తిరుప్పూర్ తదితర జిల్లాల్లోని ప్రభుత్వ ఖాతాలే లక్ష్యంగా ఈ భారీ మోసం జరిగిందని గుర్తించారు. గ్రామీణాభివృద్ధి, నిరుపేదల సంక్షేమం, అత్యవసర సేవల కోసం కేటాయించిన ప్రజాధనం ఇలా సులువుగా మాయం కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  

ఈ సైబర్ నేరం వెనుక నైజీరియాకు చెందిన అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల సిండికేట్ ప్రమేయం ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నిధులు ఎలా బదిలీ అయ్యాయి, హ్యాకర్లు వాడిన ఐపీ అడ్రస్‌లు ఏంటనే దానిపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

ఈ ఉదంతంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి. సెల్వం సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వ పేమెంట్ సిస్టమ్స్‌లోకి సైబర్ నేరగాళ్లు ఎలా చొరబడ్డారని, కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగే సమయంలో సెక్యూరిటీ అలర్ట్‌లు, ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఏమైపోయాయని ఆయన ప్రశ్నించారు.

అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం,   సీఎం విజయ్‌పై మండిపడుతూ... ప్రపంచంలోని ప్రతి రాజకీయ పార్టీకి ఐటీ వింగ్ ఉంటుంది. కానీ తమిళనాడులో మాత్రం ఓ అగ్రనటుడి ఫ్యాన్ క్లబ్, దాని సోషల్ మీడియా ఆర్మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో హ్యాగ్‌టెగ్‌లు ట్రెండ్ చేయడం వేరు, రాష్ట్రాన్ని పాలించడం వేరు  అని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా విమర్శలకు ఆన్‌లైన్ మద్దతుదారులు బదులివ్వగలరు కానీ, ప్రజల సంక్షేమం, ప్రజాధనం భద్రతకు సంబంధించి ముఖ్యమంత్రి నేరుగా ఎప్పుడు సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు.

ప్రజాధనాన్ని రక్షించడంలో విఫలమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రజలు పారదర్శక సమాధానాలు కోరుకుంటున్నారని, బలమైన ఆర్థిక భద్రతా వ్యవస్థలు అవసరమని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ భారీ బ్యాంక్ కుంభకోణం ఉదంతం తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement