తొలి బిడ్డను కోల్పోవడం తీరని విషాదం : సోనియా గాంధీ | Sonia Gandhi recalls losing first child newborn burial at Mehrauli farm | Sakshi
Sakshi News home page

తొలి బిడ్డను కోల్పోవడం తీరని విషాదం : సోనియా గాంధీ

Nov 10 2026 6:15 PM | Updated on Nov 10 2026 6:24 PM

Sonia Gandhi recalls losing first child newborn burial at Mehrauli farm

కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) లో 1969లో జరిగిన తన మొదటి సంతానం కోల్పోయిన విషాదకర సంఘటనను పంచుకున్నారు. సోనియా గాంధీ, ఆమె భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దంపతులు, పెళ్ళయిన కొద్దికాలానికే  ప్రీమెచ్యూర్‌ డెలివరీ కారణంగా బిడ్డను కోల్పోయిన 1969 నాటి  ఈ ఘటన తన జీవితంలో చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలి పోయిందని  సోనియా   పేర్కొన్నారు. తన అత్తగారు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన అధికారిక పర్యటనలను కుదించుకుని, దుఃఖంలో ఉన్న తమను ఓదార్చడానికి సమయం కేటాయించిన వైనాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: కష్టాలు, కన్నీళ్లే ఇన్నాళ్లు : చివరికి ‍శ్రుతి జీవితంలో కొత్త వెలుగులు

1968 సెప్టెంబరులో సోనియా గర్భవతి అని తెలిసినప్పుడు రాజీవ్, సోనియాతో పాటు అత్తగారైన ఇందిరా గాంధీ ఎంతో సంతోషించారు.  నానమ్మను కాబోతున్నానని తెలుసుకున్న ఇందిరా గాంధీ ఆమె ఆహారం (కూరగాయలు, పాలు), వ్యాయామం, కాబోయే పాపాయి దుస్తుల తయారీ వంటి ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఇంతలో ఏడో నెల ప్రారంభంలో సోనియాకు నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. జనవరి 18న నెలలు నిండకుండానే ఒక మగబిడ్డ జన్మించాడు. ఇంక్యుబేటర్‌లో ఉంచిన తమ బిడ్డ నల్లటి జుట్టు, సన్నని వేళ్లతో ఎంతో ముద్దుగా ఉన్నాడని సోనియా గుర్తుచేసుకున్నారు. అయితే, బిడ్డ బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. చివరికి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు ఆ పసికందు కన్నుమూశాడు. ఈ వార్త విన్న రాజీవ్, సోనియా, ఇందిరా గాంధీ తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయారు. ఎప్పుడూ భావోద్వేగాలను బయటపెట్టని రాజీవ్ గాంధీ కూడా కన్నీరుపెట్టుకున్నారని ఆమె  రాసుకొచ్చారు.


నదిలో కలిపేందుకు నిరాకరణ  మెహ్రౌలీ ఫామ్‌హౌస్‌లో దహన సంస్కారాలు

అప్పట్లో ప్రచారంలో ఉన్న సాంప్రదాయ పద్ధతి ప్రకారం మృతదేహాన్ని నదిలో నిమజ్జనం చేయాలన్న ప్రతిపాదనను తాను ఎలా తిరస్కరించిందీ సోనియా  పంచుకున్నారు.  గతంలో ఓఖ్లా బ్యారేజ్ వద్ద నది నీటిలో శవం కొట్టుకుపోవడం, దాన్ని కుక్కలు లాగడం చూసిన జ్ఞాపకాలు ఆమెను భయాందోళనకు గురిచేశాయి. దాంతో రాజీవ్ , ఆయన సోదరుడు సంజయ్ గాంధీ కలిసి మెహ్రౌలీలోని వారి కుటుంబ ఫామ్‌హౌస్‌లోని Bougainvillea చెట్టు కింద  శిశువును  ఖననం చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా, చాలా కాలం పాటు, తాను , రాజీవ్ ఆ బిడ్డను ఖననం చేసిన బౌగెన్‌విల్లా పొద దగ్గర ప్రతిసారీ ఆగి ఒక పువ్వును ఉంచేవారమిని కూడా ఆమె తెలిపారు.తొలి చూలు బిడ్డను కోల్పోయిన బాధ నుంచి బయటపడటం అంత సులభం కాలేదని, కానీ ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ చూపిన ప్రేమ, ఆదరణ ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని సోనియా గుర్తుచేసుకున్నారు.

పత్రికల్లో వార్తలు
ఊహించని ఈ ఘటనతో సోనియా తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారు. అదే సమయంలో ఒక పత్రిక ఇందిరా అక్రమ సంతానానికి నానమ్మ కావాలనే ప్రయత్నం విఫలమైందనే దారుణ  వార్తను ప్రచురించడం ఆమెను మరింత కలచివేసిందని, రాజీవ్‌ ఆమెను ఓదార్చారని రాసుకొచ్చారు. ఆ తర్వాత తేజీ బచ్చన్ (అమితాబ్ బచ్చన్ తల్లి) ఇచ్చిన ఒక కుక్కపిల్ల (రేష్మా)తో సమయం గడపడం, ఇందిరా గాంధీ ఇచ్చిన ధైర్యంతో ఆమె ఆ బాధ నుండి బయటపడ్డానన్నారు. ఆ తర్వాత అక్టోబరు 1969లో ఆమె మళ్లీ గర్భవతి అయ్యారు. పూర్తిస్థాయి బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత, జూన్ 19, 1970న రాహుల్ గాంధీకి, 72లో ప్రియాంక గాంధీకి జన్మనిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement