Bunker Roy passed away సామాజిక కార్యకర్త, విద్యావేత్త 'బేర్‌ఫుట్ కాలేజీ' (Barefoot College) వ్యవస్థాపకుడు సంజీత్ 'బంకర్' రాయ్ (81) ఇకలేరు. రాజస్థాన్‌లోని తిలోనియాలో ఉన్న తన నివాసంలో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ హక్కుల పోరాటకర్త అరుణా రాయ్ భర్త బంకర్ రాయ్. కుటుంబ సభ్యుల సమక్షంలో ఉదయం 6:15 గంటలకు ఆయన ప్రశాంతంగా కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాజస్థాన్‌లోని తిలోనియాలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఎవరీ బంకర్ రాయ్
కరువుతో అల్లాడుతున్న బిహార్ గ్రామాన్ని సందర్శించిన తర్వాత, మహాత్మా గాంధీ గ్రామీణ స్వయంసమృద్ధి ఆలోచనల స్ఫూర్తితో 1972లో 'సోషల్ వర్క్ అండ్ రీసెర్చ్ సెంటర్' అనే గ్రామీణాభివృద్ధి సంస్థను ప్రారంభించారు. గ్రామీణ భారతదేశంలోని ప్రజలకు ప్రాథమిక ఇంజనీరింగ్, వైద్య నైపుణ్యాలలో శిక్షణనిచ్చి, వారు స్వయంసమృద్ధి సాధించేలా ప్రోత్సహించారు. ఈ సంస్థే తర్వాత కాలంలో బేర్‌ఫుట్ కాలేజీగా ప్రసిద్ధి చెందింది.
1945లో జన్మించిన బంకర్ రాయ్ 1965లో భారత జాతీయ స్క్వాష్ ఛాంపియన్ గా నిలిచారు. మూడు ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌సిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
చదువురాని గ్రామీణ మహిళలకోసం సౌర శక్తి (Solar Power) ఇంజనీరింగ్‌లో శిక్షణ ఇచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. వీరి ప్రతిభకు ముచ్చటపడి ఆఫ్రికా దేశాలు సైతం ఈ మహిళల సేవలను వినియోగించుకున్నాయి.
గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గాను 2010లో 'టైమ్' (Time) మ్యాగజైన్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ('థింకర్స్' విభాగంలో) ఆయనకు చోటు కల్పించింది. ఆయన చేసిన సేవలకు గాను 1986లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రదానం చేసింది. బంకర్ రాయ్ భార్య అరుణా రాయ్ ప్రముఖ సామాజిక కార్యకర్త,మాజీ ఐఏఎస్ అధికారిణి. భారతదేశంలో చారిత్రాత్మక సమాచార హక్కు చట్టం (RTI - 2005) రావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఇదీ చదవండి: కష్టాలు, కన్నీళ్లే ఇన్నాళ్లు : చివరికి శ్రుతి జీవితంలో కొత్త వెలుగులు
పలువురి సంతాపం
దీంతో పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు రాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. భారత సమాజంలోని బలహీన వర్గాలకు విద్యను అందించడంలో,సాధికారత కల్పించడంలో ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా ఆయన గ్రామీణ వర్గాల సాధికారత కోసం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది సీపీఏ నేత రాజా నివాళులర్పించారు.
గాంధీజీ సిద్ధాంతాలను అక్షరాలా ఆచరించిన కొద్దిమంది నాయకులలో బంకర్ రాయ్ ఒకరు. పేదవారు సమస్య కాదు, వారి వద్ద కూడా అద్భుతమైన జ్ఞానం ఉంటుందని నిరూపించిన వ్యక్తి అంటూ ప్రొఫెసర్ అమితాబ్ మత్తూ తన సంతాపాన్ని వెలుబుచ్చారు.


