జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అబ్బాయి కావాలన్న అత్తింటి వారు, భర్త కోరిక మహిళ ప్రాణం తీసింది. అక్రమ లింగ నిర్ధారణ పరీక్ష చేయించడమే కాకుండా, బలవంతపు అబార్షన్ చేయించడంతో 24 ఏళ్ల మహిళ తల్లి కాకుండానే ప్రాణాలు కోల్పోయింది.
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా, శ్యామ్‌డీ చౌక్‌కు చెందిన కిరణ్ కుమారి గర్భం దాల్చింది. పండంటి బిడ్డకోసం ఎన్నో కలలు కంటోంది. ఇంతలో తమకు మగబిడ్డే పుట్టాలనే దుర్బుద్ధితో ఆమె భర్త సోనూ కేవత్, అత్తమామలు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో శ్యామ్‌డీలోని 'సెంట్రల్ డయాగ్నోస్టిక్ సెంటర్'లో ఆమెకు చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్ష చేయించారు. కడుపులో ఎదుగుతున్నది ఆడపిల్ల అని తేలడంతో, ఆమె ఇష్టానికి విరుద్ధంగా శ్యామ్‌డీ చౌక్‌లోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో అబార్షన్ చేయించారు.
ఇదీ చదవండి: 5 స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో షాక్ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం
అబార్షన్ సమయంలో విపరీతమైన రక్తస్రావం కావడంతో కిరణ్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. చికిత్స నిమిత్తం మరొక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ లేకుండా అబార్షన్ చేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బాధితురాలి తండ్రి రాజేంద్ర కుమార్ కేవత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న కిరణ్ మామ, అత్త, బావ, వదినలతో పాటు డయాగ్నోస్టిక్ సెంటర్‌కు చెందిన ఇతర ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: 56 ఏళ్ల వయసులో ప్రియురాల్ని పెళ్లాడిన సీఎం


