రేపే ‘ఛలో ఢిల్లీ’.. కాంగ్రెస్‌కు కిరణ్ రిజిజు 5 ప్రశ్నలు | Kiren Rijiju poses five questions ahead of INDIA blocs | Sakshi
Sakshi News home page

రేపే ‘ఛలో ఢిల్లీ’.. కాంగ్రెస్‌కు కిరణ్ రిజిజు 5 ప్రశ్నలు

Oct 31 2026 5:42 PM | Updated on Oct 31 2026 5:55 PM

 Kiren Rijiju poses five questions ahead of INDIA blocs

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలైందో సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సవాల్ విసిరారు. ప్రతిపక్ష కూటమి ఇండియా ఆదివారం (నవంబర్ 1) ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న ‘ఛలో ఢిల్లీ’ ర్యాలీకి ముందు కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన ఐదు ప్రశ్నలు సంధించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నిరసన తెలిపేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించిన రిజిజు.. ‘‘ఈ ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 44 స్థానాలకే ఎందుకు పరిమితమైందని ఆయన మొదటి ప్రశ్న వేశారు. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం నియమించిన ఎన్నికల సంఘం సభ్యుల పర్యవేక్షణలోనే ఆ ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు.

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా లేరని రిజిజు గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు ఆయన ఎన్నికల సంఘంలో సభ్యుడిగా నియమితుడయ్యారని, 2025లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారని వివరించారు. అయినప్పటికీ కాంగ్రెస్ వరుసగా మూడో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం జ్ఞానేశ్ కుమార్ ద్వారా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఎన్నికలను ప్రభావితం చేస్తోందని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు పదేపదే ఆరోపిస్తున్నాయి.

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు నిజమైతే.. 2014 నుంచి 2026 మధ్య ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ రాజీనామా చేస్తారా? ఆ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినందుకు పార్టీ క్షమాపణ చెబుతుందా? అని రిజిజు మరో ప్రశ్న సంధించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. అక్రమ వలసదారులు, మరణించిన వ్యక్తులు, నివాస ప్రాంతాలు మార్చుకున్న వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదా? గతంలో నిర్వహించిన 8 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలు కూడా అక్రమమేనా? అని కాంగ్రెస్‌ను నిలదీశారు.

ఈ వివాదానికి సంబంధించి సెప్టెంబర్‌లో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం కూడా చర్చకు వచ్చింది. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి తమకు తెలియకుండా తీసుకున్న నిర్ణయాలపై కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ కథనంపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. బహుళ సభ్యుల సంస్థల్లో అభిప్రాయ భేదాలు సాధారణమేనని, చివరకు అన్ని నిర్ణయాలూ ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘంలో నిర్ణయాలు ఏకాభిప్రాయం ద్వారా లేదా 2:1 మెజారిటీతో తీసుకుంటారని వివరించింది.

మొత్తంగా ఎస్‌ఐఆర్‌, ఓటర్ల జాబితా ప్రక్షాళన, ఎన్నికల సంఘం విశ్వసనీయత వంటి అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు ముదురుతోంది. నవంబర్ 1న జరిగే ఇండియా కూటమి ర్యాలీలో ఈ అంశాలపై ప్రతిపక్ష నేతలు చేసే ప్రసంగాలు, వాటికి బీజేపీ ఇచ్చే సమాధానాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.

కిరణ్‌ రిజిజు సంధించిన 5 ప్రశ్నలు

1. ఎన్నికల కమిషనర్లను మీ ప్రభుత్వమే నియమించినప్పుడు, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 44 మంది ఎంపీలు మాత్రమే ఎందుకు దక్కారు?

2. 2024లో జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా లేనప్పుడు, కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఎలా ఓటమి పాలైంది?

3. 2014 నుంచి 2026 వరకు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినందుకు ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ రాజీనామా చేసి, క్షమాపణలు చెప్పాలా?

4. అక్రమ వలసదారులు, మరణించినవారు, నివాసం మారినవారు, ఓటరు జాబితాలో ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైనవారి పేర్లన్నింటినీ ఓటరు జాబితా నుంచి తొలగించాలా? వద్దా?

5. 1952-56, 1958-61, 1965-66, 1983-84, 1987-88, 1993, 1995, 2002-2004 మధ్య చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలు (ఎస్‌ఐఆర్‌) చట్టవిరుద్ధమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement