తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం | Etala Rajender at the closing ceremony of Jawaharnagar Jana Sankalpa at Chennapuram intersection | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం

Oct 31 2026 12:52 AM | Updated on Oct 31 2026 12:52 AM

Etala Rajender at the closing ceremony of Jawaharnagar Jana Sankalpa at Chennapuram intersection

జవహర్‌నగర్‌: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేసి గంటలోనే డంపింగ్‌యార్డ్‌ సమస్యలను పరిష్కరిస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డ్‌ ఎత్తివేయాలని గత నాలుగు రోజులుగా దాదాపు 60 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర నిర్వహించి శుక్రవారం సాయంత్రం చెన్నాపురం చౌరస్తాలో జవహర్‌నగర్‌ జనసంకల్ప ముగింపు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ డంప్‌యార్డ్‌ తీసేయాలని తాను పాదయాత్ర చేస్తుంటే కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు పనిలేక తిరుగుతున్నానని ఎద్దేవా చేయడం పద్ధతి కాదన్నారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ను గద్దెదింపే వరకు పోరాటాలను ఆపేదిలేదన్నారు. 

‘మళ్లీ చెబుతున్నా.. డంప్‌యార్డ్‌ తరలింపునకు ఎంత ఖర్చు అవుతుందో డీపీఆర్‌ చేసి ఇవ్వండి.. .ప్రధాన మంత్రి మోదీని ఒప్పించి ఆ డబ్బులను నేను తీసుకువస్తాను’అని హమీ ఇచ్చారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల కోసం మరిన్ని ప్రజా పోరాటాలను నిర్వహిస్తామన్నారు. కాగా, సభ ప్రారంభమైన గంటలోనే వర్షం పడడంతో సభకు అంతరాయం కలిగింది. వర్షంలోనే ఈటల రాజేందర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రానున్న రోజుల్లో ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లోకి వెళ్లేందుకే పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందర్‌రావు, శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్‌రెడ్డి, దన్‌పాల్‌ సూర్యనారాయణ, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్ప, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, చంద్రశేఖర్‌ యాదవ్, రాష్ట్ర నాయకులు డాక్టర్‌ మురళీధర్‌ గౌడ్, కవిత, మాజీ కార్పొరేటర్‌ పానుగంటి బాబు, జవహర్‌నగర్‌ అధ్యక్షుడు కమల్, చంద్రపురి డివిజన్‌ అధ్యక్షుడు జ్యోగారావు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement