నవంబర్ 5న దీపావళి బోనస్ చెల్లింపు!
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సింగరేణి ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది రేవంత్ సర్కార్. ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 దీపావళి బోనస్ ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
దీపావళి బోనస్ కోసం రూ.419 కోట్లు సింగరేణి యాజమాన్యం విడుదల చేయనుంది. సుమారు 38 వేల మంది సింగరేణి కార్మికులకు బోనస్ అందనుంది. నవంబర్ 5న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో బోనస్ జమ అయ్యే అవకాశం ఉంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో బోనస్ చెల్లింపునకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది. నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్(NCWA) ఉద్యోగులకు మాత్రమే దీపావళి బోనస్ వర్తించనుంది. అధికారులకు ఈ బోనస్ వర్తించదు. గత ఆర్థిక సంవత్సరంలో కనీసం 30 రోజులు పనిచేసిన కార్మికులకు బోనస్ అర్హతగా నిర్ణయించారు.
అర్హత పని దినాలు పూర్తి చేసిన కార్మికులకు పూర్తిస్థాయి బోనస్ ఇవ్వనున్నారు. మిగతావారికి పని దినాల ఆధారంగా చెల్లిస్తారు. దీంతో దసరా, దీపావళి బోనస్‌లతో సింగరేణి కార్మికులకు నెల రోజుల్లోనే భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లయ్యింది. రెండు బోనస్‌ల రూపంలో ఒక్కో కార్మికుడికి సగటున రూ.2.65 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. దసరా, దీపావళి బోనస్‌లతో కలిపి కార్మికులకు సుమారు రూ.1,020 కోట్ల చెల్లిస్తున్నారు.
దీనిలో భాగంగా సింగరేణి కార్మికులకు ముందుగానే దీపావళి శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించి పోటీని అధిగమించాలని సింగరేణి కార్మికులకు సూచించారు. బోనస్ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు పొదుపు చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ‘ ఆ భూములు అమ్ముతామంటే మేం ఒప్పుకోం’


