భూతాపోన్నతి వల్ల తీవ్ర అగాధంలోకి ప్రజారోగ్యం
గత 11 ఏళ్లు చరిత్రలోనే అత్యంత ఉష్ణోగ్రత కలిగిన సంవత్సరాలుగా నమోదయ్యాయి
వాతావరణ సంక్షోభం ఇప్పుడు ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’గా మారింది
ప్రతిష్ఠాత్మక ‘లాన్సెట్ కౌంట్‌డౌన్ 2026’ తాజా నివేదిక హెచ్చరిక
(సాక్షి, స్పెషల్ డెస్క్): పారిస్ ఒప్పందం అమల్లోకి వచ్చి పదేళ్లు పూర్తయినా, కర్బన ఉద్గారాలు పెరిగిపోతుండటంతో భూతాపోన్నతి వల్ల ప్రజారోగ్యం తీవ్ర అగాధంలోకి కూరుకుపోతోందని ప్రతిష్ఠాత్మక ‘లాన్సెట్ కౌంట్‌డౌన్ 2026’ తాజా నివేదిక స్పష్టం చేసింది. మానవాళి చరిత్రలోనే గత 11 ఏళ్లు అత్యంత అధిక ఉష్ణోగ్రత సంవత్సరాలుగా నమోదయ్యాయని, వాతావరణ సంక్షోభం ఇప్పుడు ఏకంగా ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’గా మారిందని హెచ్చరించింది.
అధిక ఉష్ణోగ్రతలతో రికార్డు మరణాలు
ఎండల తీవ్రత కార్మికుల ఆరోగ్యాన్ని, జీవనోపాధిని దెబ్బతీస్తోంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా 573 బిలియన్ పని గంటలు వృథా అయ్యాయి. దీనివల్ల 1.07 లక్షల కోట్ల డాలర్లకు పైగా శ్రామికుల ఆదాయానికి నష్టం వాటిల్లింది. ఇందులో ఒక్క వ్యవసాయ రంగ నష్టమే 37.8 శాతం మేరకు ఉంది. 2016– 2023 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 5.4 లక్షల మరణాలు అధిక ఉష్ణోగ్రతలతో ముడిపడి ఉన్నాయి.
ఇందులో 68.4 శాతం మరణాలకు మానవ తప్పిదాల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పులే కారణమని నివేదిక నిర్ధారించింది. 2023 ఒక్క సంవత్సరంలోనే అత్యధికంగా 7.10 లక్షల మంది తీవ్ర ఎండల వల్ల మృత్యువాత పడ్డారు. ఉష్ణోగ్రతల పెరుగుదలతో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ అనుకూలత 31 శాతం పెరిగింది. సముద్ర తీరాల వాతావరణంలో వేడిమి పెరగటంతో ‘విబ్రియో’ బ్యాక్టీరియా ముప్పు విస్తరించింది. అలాగే కరువులు, వడగాలుల వల్ల 2024లో అదనంగా 12.79 కోట్ల మంది ఆహార అభద్రతతో అలమటించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు రిక్తహస్తం
వాతావరణ సంబంధిత ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏటా కనీసం 330 కోట్ల డాలర్ల సహాయ నిధులు అవసరమని అభివృద్ధి చెందుతున్న 48 దేశాలు కోరాయి. అయితే, 2024లో అంతర్జాతీయంగా సమకూరిన నిధులు కేవలం 110 కోట్ల డాలర్లు మాత్రమే కావటం గమనార్హం. వాతావరణ–ఆరోగ్య సంబంధిత పరిశోధనా నిధులు 2016– 2024 మధ్యలో 4.2 కోట్ల డాలర్ల నుంచి 31.6 కోట్ల డాలర్లకు పెరిగినప్పటికీ, ఈ గ్రాంట్లలో 88% నిధులు కేవలం సంపన్న దేశాల పరిశోధకులకే దక్కాయి. అత్యధిక ముప్పును ఎదుర్కొంటున్న అల్పాదాయ దేశాలకు కేవలం 1% మాత్రమే లభించాయి.
భారత్‌పై తీవ్ర ప్రభావం
మధ్యస్థ మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ) గల దేశాల విభాగంలో, ముఖ్యంగా భారత్‌లో, ఆరుబయట శ్రమించే సాధారణ ప్రజలు వేడి ఒత్తిడి బారిన పడే గంటలు ఏడాదికి సగటున తలసరి 2,430 గంటలుగా నమోదయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యధిక స్థాయి. భారత్‌లోని పది ప్రధాన నగరాల్లో సుమారు 36 లక్షల మరణాలపై జరిగిన విశ్లేషణను నివేదిక ఉటంకించింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పీఎం 2.5 గాలి కాలుష్య తీవ్రతతో సంభవించే మరణాల ముప్పు మున్ముందు ఐదు రెట్లు పెరుగుతుందని నివేదిక వెల్లడించింది.
నష్టంలో మనది మూడో స్థానం
2016–25 దశాబ్దంలో ఎండల వల్ల పని గంటలు తగ్గి అంతర్జాతీయంగా శ్రామిక ఆదాయ నష్టం బాగా పెరిగింది. అధిక నష్టం చవిచూసిన చైనా, అమెరికా తర్వాత మూడో స్థానంలో నిలిచిన భారత్ వాటా ఏకంగా 12.4 శాతంగా ఉంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, 2024లో శిలాజ ఇంధనాలకు అనేక దేశాలు అత్యధికంగా నికర సబ్సిడీలు ఇస్తున్నాయి. 5 వేల కోట్ల డాలర్లకు పైగా సబ్సిడీలిచ్చిన దేశాల్లో రష్యా, ఇరాన్, చైనాతో పాటు భారత్ కూడా ఉందని నివేదిక ఎత్తిచూపింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశలవారీగా తగ్గిస్తూ స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధన రంగాన్ని వేగంగా విస్తరించాలని, ముందస్తు ఆరోగ్య హెచ్చరిక వ్యవస్థలను పటిష్టం చేయాలని పిలుపునిచ్చింది.


