కంప్యూటర్ కోర్సుల్లోనూ కనిపించని ఆసక్తి
డీమ్డ్ వర్సిటీల వైపే విద్యార్థుల మొగ్గు
నైపుణ్యాలు, ఉద్యోగాలనే కోరుకుంటున్న యువత
సాక్షి, హైదరాబాద్: కన్వీనర్ కోటా కింద నిర్వహించిన ఇంజ నీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది ప్రవేశాలు తగ్గాయి. కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్ వంటి కోర్సుల్లోనూ ఇదే ట్రెండ్ కొన సాగింది. 2024–25 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో 91 శాతం సీట్లు భర్తీ కాగా 2025–26లో 86 శాతానికి తగ్గాయి. ఈ ఏడాది 2026–27 79 శాతానికి పడిపోయాయి. డీమ్డ్ వర్సిటీలు రావడం, అటానమస్ కాలేజీలు పెరగడం వల్ల విద్యార్థులు వాటికి ప్రాధాన్యమిస్తున్నారు. అనుబంధ గుర్తింపు ఉన్న పది కాలేజీల్లోనే 93 శాతం మేర ప్రవేశాలు జరిగాయి. డీమ్డ్, అటానమస్ సంస్థల్లో సబ్జెక్టు కన్నా, నైపుణ్యాలను అందిస్తున్నారన్న ప్రచారానికి ఆకర్షితులైనట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జేఎన్‌టీ యూహెచ్, ఉస్మానియాలో జాతీయ ర్యాంకులు పడిపోవడం, అధ్యాపకుల కొరత వల్ల అక్కడా ప్రవేశాలు పడిపోయినట్లు తెలుస్తోంది.
94,251 సీట్లు.. చేరింది 74,510 మందే
రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం... 2024లో 87,184 సీట్లు ఉండగా 79,224 మంది ప్రవేశాలు పొందారు. 2025లో సీట్ల సంఖ్య 91,909కు పెరి గినా చేరికల సంఖ్య 79,288గానే నమోదైంది. 2026లో సీట్లు 94,251కు పెరగ్గా ప్రవేశాలు మాత్రం 74,510కే పరిమితమ య్యాయి. ఫలితంగా 19,741 సీట్లు ఖాళీగా మిగిలాయి. 2025తో పోలిస్తే 2026లో ప్రవేశాలు 4,778 తగ్గాయి. కంప్యూటర్ అండ్ ఐటీ విభాగంలో 2024లో 61,653 సీట్లకు 59,546 మంది చేరగా (97 శాతం), 2025లో 65,143 సీట్లకు 59,780 మంది చేరగా 2026లో 66,372 సీట్లకు 54,625 మందే (82 శాతం) ప్రవేశాలు పొందారు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ)లో 2024లో 98 శాతం ప్రవేశాలు నమోదవగా 2026లో 84 శాతానికి తగ్గాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్)లో 2024లో 95 శాతం ఉండగా, 2026లో 78 శాతానికి పడిపోయింది. ఏఐ, డేటా సైన్స్‌లో 2024లో 94 శాతం ప్రవేశాలు నమోదవగా 2026లో 72 శాతమే నమోదయ్యాయి. ఏఐ–మెషీన్ కోర్సులో ప్రవేశాల శాతం 2024లో 92 నుంచి 2026లో 67కు తగ్గింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులో 2024లో 95 శాతం ఉండగా 2026లో 77 శాతానికి పరిమితమైంది.
ఈఈఈ, మెకానికల్‌లోనూ ఖాళీలు
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ)లో 2026లో 5,051 సీట్లకు 3,048 మంది మాత్రమే చేరారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో 3,524 సీట్లకు 2,118 మంది చేరగా, సివిల్ ఇంజనీరింగ్‌లో 3,848 సీట్లకు 2,632 మంది ప్రవేశాలు పొందారు. సివిల్, మెకానికల్ తదితర అనుబంధ కోర్సుల్లో 2024లో 62 శాతం ప్రవేశాలు ఉండగా, 2026లో 65 శాతానికి పెరిగాయి. ఇతర ఇంజనీరింగ్ కోర్సు ల్లోనూ ప్రవేశాల శాతం 2024లో 73 నుంచి 2026లో 84కు పెరిగింది. అయితే, రోబోటిక్స్–ఏఐ, సీఎస్‌ఈ (నెట్‌వర్క్స్), బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో 100 శాతం ప్రవేశాలు నమోదయ్యాయి. బయోటెక్నాలజీలో 88 శాతం, కెమికల్ ఇంజనీరింగ్‌లో 98 శాతం, ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో 97 శాతం ప్రవేశాలు జరిగాయి.


