మల్లన్నసాగర్ వద్ద గుట్టలను పేల్చిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న హరీశ్‌రావు
బీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు
మల్లన్నసాగర్ వద్ద జరుగుతున్న బ్లాస్టింగ్‌ల పరిశీలన
గజ్వేల్/కొండపాక: కాళేశ్వరం ప్రాజెక్టుపై సర్కారు కుట్రలకు పాల్పడుతున్నదని, గతంలో మేడిగడ్డ వద్ద బ్లాస్టింగ్‌లు జరిగాయని అనుమానాలున్నాయని, తాజాగా మల్లన్నసాగర్ నుంచి మూసీ సుందరీకరణకు నీళ్ల తరలింపు పనుల కోసం అక్రమ బ్లాస్టింగ్‌లు జరుగుతున్నాయని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు మండిపడ్డారు. గురువారం సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం తిప్పారంలో మల్లన్నసాగర్ కట్ట పక్కన జరుగుతున్న రాళ్ల గుట్టల బ్లాస్టింగ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ సైట్ ఇంజనీర్‌ను పనుల తీరుపై ప్రశ్నలు వేసి, నిబంధనలకు విరుద్ధంగా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుశాఖలతోపాటు గ్రామపంచాయతీల అనుమతి లేకుండా రెండు, మూడు నెలలుగా అక్రమ బ్లాస్టింగ్‌లు జరుగుతున్నాని చెప్పారు.
మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు.. కానీ..
మూసీ ప్రక్షాళన, హైదరాబాద్‌కు నీటి తరలింపు పనులకు తాము వ్యతిరేకం కాదని, నిబంధనల ప్రకారం పనులు జరగాలన్నదే తమ ఉద్దేశమని హరీశ్‌రావు చెప్పారు. ఈ బ్లాస్టింగ్‌ల వల్ల ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న తిప్పారం గ్రామంలోని ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయని, కొన్ని ఇళ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయని ఇక్కడి ప్రజలు చెబుతున్నారని తెలిపారు.
అర్ధరాత్రి టన్నుల కొద్దీ పేలుళ్ల వల్ల మల్లన్నసాగర్ కట్ట కుంగిపోయి, రిజర్వాయర్ నుంచి నీళ్లు సైతం లీకవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారన్నారు. అనుమతులతో ప్రమేయం లేకుండా పనులు చేపట్టడానికి కారకులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీపై యుద్ధ ప్రాతిపదికన క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు. ఈ అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్టు చెప్పారు.


