హనుమకొండ, పటాన్‌చెరు, అందోల్, కొడకండ్ల శాఖల్లో అక్రమాల ఆరోపణలు
రూ.లక్షల్లో నిధుల మళ్లింపునకు యత్నం..ఆడిట్‌లో గుర్తించిన ఉన్నతాధికారులు
12 మంది అధికారులు, ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు.. సమగ్ర విచారణకు ఆదేశాలు
హనుమకొండ అర్బన్: రాష్ట్రంలోని వివిధ ఖజానా శాఖ కార్యాలయాల్లో నిధుల చెల్లింపుల వ్యవహారం కల కలం రేపుతోంది. లక్షల రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా ఇతర ఖాతాలకు మళ్లించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఖజానా శాఖ ఉన్నతాధికారులు 12 మంది అధికా రు లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నెల 27న ఉత్తర్వు లు జారీ చేయగా, విషయాన్ని గోప్యంగా ఉంచారు.
హనుమకొండలో ముగ్గురిపై వేటు
హనుమకొండ ఖజానా కార్యాలయంలో సహాయ ఖజానా అధికారి అన్వర్, ఉప ఖజానా అధికారి దయాకర్, సీనియర్ అకౌంటెంట్ వేణులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరి పర్యవేక్షణలో జరిగిన చెల్లింపులపై ఆడిట్ సంద ర్భంగా అభ్యంతరాలు వ్యక్తమైనట్టు సమాచారం. ప్రాథమిక చర్యల్లో భాగంగా సస్పెన్షన్ విధించడంతోపాటు, అసలు ఏం జరిగిందనే అంశంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. హనుమకొండలో సస్పెన్ష న్‌కు గురైన అధికారుల వ్యవహారంలో కొందరు ఉన్న తాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు జోక్యం చేసుకున్నట్టు తెలిసింది. పొరపాటున జరిగిన వ్యవహా రంగా వివరించి క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
పటాన్‌చెరు, హనుమకొండలో ఒకే తరహా వ్యవహారం
హనుమకొండ, పటాన్‌చెరు ఖజానా కార్యాలయాల్లో పెన్షనర్లకు చెల్లించే మొత్తాల విషయంలో పరిమితులకు మించి చెల్లింపులకు ఆమోదం తెలిపినట్టు ఆడిట్‌లో గుర్తించినట్టు సమాచారం. పటాన్‌చెరులో ఇద్దరిని సస్పెండ్ చేశారు.
అందోల్‌లో మరింత తీవ్రమైన ఆరోపణలు
అందోల్ ఖజానా కార్యాలయంలో మాత్రం నిధుల బదిలీలకు సంబంధించిన వ్యవహారం భిన్నంగా ఉన్నట్టు సమాచారం. చెల్లింపులకు ఆమోదం తెలిపి న అధికారులు, నిధులు జమ చేయాల్సిన ఖాతాల వివరాలను సరిచూశారా? లేదా? అనే కోణంలో పరి శీలన చేపట్టినట్టు తెలిసింది. ఖజానా శాఖతో సంబంధం లేని ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు నిధులు మళ్లించేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. అక్కడ ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
కొడకండ్ల ఖజానాలో నకిలీ చలాన్లతో కన్నం
జనగామ జిల్లా కొడకండ్ల ఖజానా కార్యాలయంలో నకిలీ చలాన్లను సృష్టించి ఖజానా నిధులకు గండికొ ట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం నల్లగొండ జిల్లా మోత్కూ రు ఉప ఖజానా అధికారిగా పనిచేస్తున్న రాములును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమాలు జరిగిన సమయంలో ఆయన కొడకండ్ల ఖజానా కార్యాలయంలో ఇన్‌చార్జ్ ఉప ఖజానా అధికారిగా పనిచేశారు.
నిబంధనలకు మించి చెల్లింపులు?
ఖజానా శాఖలో వివిధ విభాగాలు, ఉద్యోగుల కేడర్లను బట్టి చెల్లింపులపై పరిమితులు ఉంటాయి. పెన్షనర్లకు సంబంధించిన కొన్ని చెల్లింపుల విషయంలో రూ.16 లక్షల వరకు ఉన్న కేసులకు వర్తించే పరిమితిని మించి చెల్లింపులకు అనుమతులు ఇచ్చినట్టు రాష్ట్రస్థాయి అధికా రులు ఆడిట్‌లో గుర్తించినట్టు సమాచారం. దీంతో సంబంధిత చెల్లింపులను నిలిపివేసి, బాధ్యు లుగా భావిస్తున్న అధికారులపై ప్రాథమిక చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. అయితే నిధులు వాస్తవంగా మళ్లించారా? నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారా? అనే అంశాలు విచారణలో తేలాల్సి ఉంది.


